యూట్యూబ్‌తో ఇన్‌స్టాగ్రామ్ పోటీ..

యూట్యూబ్‌తో ఇన్‌స్టాగ్రామ్ పోటీ..
X

మన తెలంగాణ ప్రత్యేక కథనం: ‘బానపొట్ట తగ్గించుకోవటం ఎట్లా?’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో వెతికారనుకోండి. రీల్‌లో ఒక ట్రైనర్ ప్రత్యక్షమై.. ‘రెండు చేతులూ పైకెత్తండి’ అంటాడు. కుడి చెయ్యి లేపారు. ఎడమ చేతిలో ఫోన్ ఉందాయె! దాన్ని ఎక్కడ పెట్టాలా అని చూసేలోపే రీల్ అయిపోయింది. ఇదివరకైతే మిగతా వ్యాయామం కోసం యూట్యూబ్‌లో ఆ ట్రైనర్‌ను వెతకాలి. ఇప్పుడు ఆ కాస్త శ్రమ కూడా ప్రేక్షకుడికి ఎందుకని ఇన్‌స్టాగ్రామ్‌కు అనిపించినట్టుంది!

అందుకే ‘ఫీచర్స్’ పేరుతో ఒక ప్రయోగం చేస్తోంది. ఇందులో 90 నిమిషాల వరకు వీడియోలు పెట్టొచ్చు. రీల్ నచ్చితే దాన్నుంచే పూర్తి వీడియోలోకి వెళ్లొచ్చు. ఫోన్ అడ్డం తిప్పితే ట్రైనర్ రెండు చేతులూ చాపినా తెరలో సరిపోతాడు. బ్రెజిల్, అమెరికాలో ఎంపిక చేసిన కొందరితో ఈ సదుపాయాన్ని పరీక్షిస్తున్నారు. భారత్‌లో ఎప్పుడొస్తుందో ఇంకా ప్రకటించలేదు.

ఇంతకీ ఇన్‌స్టాగ్రామ్‌కు యూట్యూబ్‌తో పేచీ ఏమిటి? ట్రైనర్‌ను మనకు పరిచయం చేసేది ఇన్‌స్టాగ్రామ్. ఆయన క్లాసు నచ్చి మనం అరగంట గడిపేది యూట్యూబ్‌లో. ‘విద్యార్థిని తెచ్చింది నేను.. అటెండెన్స్ నీకా?’ అన్నట్టుంది ఇన్‌స్టా పరిస్థితి. అందుకే క్లాసు కూడా తన దగ్గరే పెట్టాలనుకుంటోంది. ప్రకటన ఇచ్చేవారి లెక్క ఇంకోలా ఉంటుంది. రీల్‌ను లక్ష మంది చూసి ఉండొచ్చు. పదో నిమిషంలో ట్రైనర్ తన షూ గురించి చెప్పేసరికి ఎంతమంది మిగిలారన్నదే వారికి కావాలి.

ట్రైనర్ చెప్పేది రోజూ ఒక అరగంట కదలమని. మీరు మాత్రం సోఫాలో కాస్త వెనక్కి వాలి, కాళ్లు చాపి, ఆయన చేసే వ్యాయామాలన్నీ తీరిగ్గా చూస్తారు. మధ్యలో ఒక్కసారే ముందుకు వంగుతారు. జారిపోతున్న దిండును సర్దుకోవడానికి! వీడియో అయిపోయేసరికి ట్రైనర్‌కు చెమట పట్టింది. మీకు మాత్రం లేవడానికి ఇంకాస్త బద్ధకం పెరిగింది. ‘నేటి నుంచే చేద్దాంలే’ అనుకుంటారు. మీ వ్యాయామానికి నేడుంది. ఇన్‌స్టాగ్రామ్‌కు కావాల్సిన మీ అరగంట మాత్రం నేడే దక్కింది!

Tags

Next Story