వరంగల్ లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ అరెస్టు

అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి రూ.1.25 కోట్ల విలువైన 251 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు. నిందితుడి నుంచి ద్విచక్ర వాహనం, రూ.9 వేల నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మంగళవారం హన్మకొండలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ ఆధ్వర్యంలో దామెర పోలీసులు పులుకుర్తి గ్రామానికి చెందిన ముదిగొండ నాగేశ్వర్‌రావును అరెస్టు చేసినట్లు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిశాకు చెందిన వ్యక్తుల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలకు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు.
నిందితుడి నుంచి లభించిన సమాచారంతో ఇతర రాష్ట్రాల్లో గంజాయి కొనుగోలు చేసిన, విక్రయించిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. గంజాయి విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పరకాల ఏసీపీ సతీష్‌బాబు, శాయంపేట సీఐ సుధాకర్‌రెడ్డి, ఆత్మకూర్ సీఐ సంతోష్, దామెర ఎస్‌ఐ వీరభద్రరావు, శాయంపేట ఎస్‌ఐ పరమేశ్వర్, పరకాల ఎస్‌ఐ రఘుపతి తదితరులను సీపీ అభినందించారు.
-
Home
-
Menu
