ఆస్తి వివాదాలతోనే రియల్టర్ హత్య

ఆస్తి వివాదాలతోనే రియల్టర్ హత్య
X

సంచలనం సృష్టించిన రియల్టర్ హత్య కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆస్తి వివాదాలు, పాతకక్షలతోనే రియల్టర్ గంటా వెంకటరత్నంను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలినట్లు సమాచారం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్‌నగర్‌లో వెంకటరత్నంను ఆరుగురు యువకులు సోమవారం ఉదయం హత్య చేసిన విషయం తెలిసిందే. ఎపిలోని విజయవాడకు చెందిన వెంకటరత్నం ధూల్‌పేట్‌కు చెందిన సుదేష్ సింగ్ వద్ద డ్రైవర్‌గా పనిచేసేవాడు. సుదేష్ సింగ్ గంజాయి, గుండుంబా, రౌడీయిజంతో నగరంలోని పలువురిని బెదిరిస్తూ డాన్‌గా ఎదిగాడు. ఇలా పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు, ఇలా వచ్చిన డబ్బులను తన వద్ద పనిచేస్తున్న బినామీల పేర్లపై ఆస్తులను కొనుగోలు చేసినట్లు తెలిసింది. అందులో వెంకటరత్నం పేరుపై కూడా వందల కోట్ల ఆస్తులు పెట్టినట్లు తెలిసింది.

2001లో సుదేష్ సింగ్‌ను ఎన్‌కౌంటర్ చేయడంతో అక్కడి నుంచి పారిపోయిన వెంకటరత్నం నగర శివారులో ఉంటున్నాడు. సుదేష్ సింగ్ తనను పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తాడని ముందుగానే తెలుసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సుదేష్ సింగ్ ఆచూకీ కోసం ఎంత వెతికినా పోలీసులకు దొరకకపోవడంతో వెంకటరత్నంపై ఒత్తిడి చేసి ఆచూకీ తెలుసుకున్నట్లు తెలిసింది. తర్వాత సుదేష్ సింగ్‌ను పట్టుకన్న పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీంతో వెంకటరత్నం సుదేష్ సింగ్ కుటుంబ సభ్యుల నుంచి దూరంగా వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు జవహర్ నగర్‌లో భార్య ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉంటున్నాడు. వెంకటరత్నం వల్లే సుదేష్ సింగ్ ఆచూకీ పోలీసులకు తెలిసిందని, అంతేకాకుండా తన పేరుపై ఉన్న ఆస్తులు సుదేష్ సింగ్ కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా పారిపోవడంతో వారు వెంకటరత్నంపై కక్ష పెంచుకున్నారు. అప్పటి నుంచి వెంకటరత్నం ఆచూకీ కోసం నగరంలో చాలా ఏళ్ల నుంచి గాలిస్తున్నారు.

ఈ క్రమంలోనే వెంకటరత్నం ఉంటున్న ఏరియా గురించి ఇటీవలే సుదేష్ సింగ్ కుటుంబ సభ్యులకు తెలిసింది. రెక్కీ నిర్వహించిన సుదేష్ సింగ్ కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు ఆటోలో నలుగురు, బైక్‌పై ఇద్దరు వచ్చారు. వెంకటరత్నం ఇంటి నుంచి కూతురిని తీసుకుని పాఠశాలకు వెళ్లి, తిరిగి వస్తుండగా రాంగ్‌రూట్‌లో వచ్చి ఢీకొట్టి కిందపడేశారు. వెంటనే తుపాకీతో కాల్చి, కత్తులతో పొడిచారు, తలపై బండరాయి వేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆరుగురు నిందితులు హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో వారిని రాచకొండ పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.

Tags

Next Story