జెబిఐటీ విద్యార్థిని ఆత్మహత్య

మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్కేపల్లి రెవెన్యూలో ఉన్న జేబీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏఐడీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం..వనపర్తి పట్టణంలోని పెద్దగూడెం మహారాజుల కాలనీకి చెందిన సి.వైష్ణవి ఈనెల 3న తన నివాసంలో ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే కళాశాలలోని ప్రొఫెసర్ల వేధింపుల వల్లే వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడిందని తోటి విద్యార్థులు ఆరోపించారు.
కళాశాలలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వెంకట్రెడ్డి, ఉపేందర్ వైష్ణవి పట్ల అవమానకరంగా మాట్లాడటమే కాకుండా, బెంచీపై నిలబెట్టారని తెలిపారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన వైష్ణవి ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. విద్యార్థిని వైష్ణవి మృతికి కారణమైన ప్రొఫెసర్లను కళాశాల నుంచి తొలగించి, విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై వైష్ణవి తల్లిదండ్రులు మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.
-
Home
-
Menu
