25న కాంగ్రెస్‌ను వీడుతున్నా

జగిత్యాలతో నా అనుబంధాన్ని
ఎవరూ విడదీయలేరు
నా విషయంలో రాష్ట్ర నాయకత్వం చొరవ
చూపకుండా అధిష్ఠానంపై
నెట్టివేసింది: జీవన్‌రెడ్డి
మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడేందుకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 25న స్థానిక బండారి గార్డెన్‌లో తన అనుచరులు, అభిమానులు, రాజకీయ సహచరులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీకి రాజీనామా చేస్తానని, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని జీవన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జగిత్యాలలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో ఉన్న నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోవడం కొంత బాధగా ఉన్న పార్టీనీ వీడక తప్పడం లేదన్నారు. గత 20 మాసాల నుంచి జగిత్యాలలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో కొనసాగాలా... వద్దా అని ఆలోచించే పరిస్థితి ఏర్పడిందన్నారు. నా సమస్యకు పరిష్కారం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చానన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి నేటి వరకు పదవి ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశానన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సకాలంలో రుణాలు చెల్లించిన వారికి ప్రోత్సాహకంగా రూ. 5 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చి జగిత్యాలలో అమలు చేయకపోవడంతో రైతులకు ప్రోత్సాహం అందించాలని మంత్రిగా ఉండి కూడా రైతుల పక్షాన నిలిచి ధర్నా చేశానని ఆయన గుర్తు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పార్టీ అంతర్గత వ్యవహరాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలని సూచించినా పార్టీ పెద్దలెవరూ పట్టించుకోలేదన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతగా గత దశాబ్దకాలంగా పని చేసి అధికారం వచ్చిన తర్వాత మా హక్కులు కాలరాస్తుంటే ఎంత కాలం భరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయం చేయడమే గౌరవం కోసమని, ఆ గౌరవమే లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని వీడోద్దని కోరేందుకు వచ్చిన మంత్రి శ్రీధర్‌బాబుకు నా పరిస్థితి వివరించిన తర్వాత ఆయన కూడా సమాధానం చెప్పలేకపోయారన్నారు. ప్రత్యర్థి పై పోరాటం చేయడం సహజం కానీ, సొంత పార్టీపై పోరాటం చేయడం ఎంత బాధకరమో అనుభవించిన వారికి తెలుస్తుందన్నారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో నేను ప్రతిపాదించిన వారికి టిక్కెట్లు వచ్చిన వారికి ఎన్నికల్లో ప్రచారం చేయలేకపోయానని అన్నారు.
ఇంత దూరం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో కొనసాగటం సరి కాదని, అందుకే పార్టీ నుంచి వైదొలగాలనే అభిప్రాయానికి వచ్చానన్నారు. నా విషయంలో రాష్ట్ర నాయకత్వం చొరవ చూపకుండా పార్టీ అధిష్టానంపై నెట్టివేస్తున్నారన్నారు. నాకు పార్టీలో అన్యాయం జరగడంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పాత్ర కూడా ఉందన్నారు. రాష్రంలో జరిగిన పార్టీ ఫిరాయింపుల ప్రభావం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై ప్రభావం తప్పక చూపుతుందన్నారు. ఎంఎల్‌సిగా కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా శాసన మండలిలో ఒంటరి పోరాటం చేశానని, రేవంత్ రెడ్డి కేబినేట్‌లో మంత్రి పదవి పొందేందుకు నాకు అన్ని విధాల అర్హత ఉందని, అయినా నాకు ఇవ్వకుండా మొండి చేయి చూపారన్నారు. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కలాగా నేను నా స్థాయిలో పోరాటం చేశానని, అయినా నాకు పదవి ఇవ్వకుండా పక్కన బెట్టి నా సంయమనాన్ని పరీక్షించారన్నారు. ప్రజాస్వామ్యంలో నా స్వేచ్చకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నానని, ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వివరించారు. జగిత్యాలతో నా అనుబంధం ఎవరూ తెంచలేరని, నా చివరి శ్వాస వరకు జగిత్యాలతో నా అనుబంధం కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో నాయకులు దుర్గయ్య, రాధాకిషన్‌రావు, పుప్పాల అశోక్, సురేందర్, నేహాల్, దామోదర్‌రెడ్డి, రాంచందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
