టి-20 ప్రపంచకప్‌.. జియో హాట్‌స్టార్ కీలక నిర్ణయం?

Jio Hotstar
X

వచ్చే ఏడాది ఐసిసి టి-20 ప్రపంచకప్ జరుగనుంది. ఈ ప్రపంచకప్‌కి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ కూడా ప్రకటించారు. అయితే ఈ టోర్నీకి ముందు ప్రముఖ ఒటిటి సంస్థ జియో హాట్‌స్టార్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కి షాక్ ఇస్తూ.. ఈ టోర్నమెంట్ ప్రసారకర్త బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఐసిసికి చెప్పినట్లు సమాచారం. అంతేకాక నాలుగేళ్ల భారత మీడియా హక్కుల ఒప్పందంలోని మిగిలిన రెండేళ్ల కాంట్రాక్ట్‌ని కూడా కొనసాగించలేమని జియో హాట్‌స్టార్ తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సదరు ఒటిటి ఫ్లాట్‌ఫామ్‌కి వస్తున్న భారీ ఆర్థిక నష్టాలే ఈ నిర్ణయం వెనుక కారణంగా తెలుస్తోంది.

దాదాపు 2.4 బిలియన్ల డాలర్లతో 2026-29 మధ్య కాలానికి భారత మీడియా హక్కులకు సంబంధించిన విక్రయ ప్రక్రియను ఐసిసి తాజాగా ప్రారంభించింది. జియో హాట్‌స్టార్ 2024-27 మధ్య కాలానికి 3 బిలియన్ల డాలర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు జియో హాట్‌స్టార్ వైదొలగాలని నిర్ణయించుకోవడంతో బిడ్‌లు దాఖలు చేయాలని పలు ప్రధాన ఒటిటి ఫ్లాట్‌ఫామ్‌లను ఐసిసి ఆహ్వానించిది. సోని పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి సంస్థలను సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ, ఒప్పందం విలువ చాలా అధికంగా ఉండటంతో ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాలేదని సమాచారం.

Tags

Next Story