జూరాలలో ఆకుపచ్చగా మారిన నీరు

జూరాలలో ఆకుపచ్చగా మారిన నీరు
X

జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల జలాశయంలో గత నాలుగు రోజులుగా నీరు ఆకుపచ్చ రంగులోకి మారి దుర్వాసన వస్తుండటంతో మత్స్యకారులు, రైతులు, ప్రజలు, పర్యాటకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జలాశయం నీటిపై పచ్చటి పొర ఏర్పడటంతోపాటు కొన్ని చేపలు మృతి చెందుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. జూరాల జలాశయంలో నీరు ఇలా రంగు మారడం, దుర్వాసన రావడం ఇదే తొలిసారని మత్స్యకారులు పేర్కొంటున్నారు. నీటి ప్రవాహం నిలిచిపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందా? లేక పరిశ్రమల వ్యర్థాలు, రసాయనాలు నీటిలో కలిశాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలోని రాయచూరు, దేవసుగూరు ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు జలాశయంలోకి చేరుతున్నాయేమోనని కొందరు మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జలాశయంలో చేపలు పట్టిన కొద్దిసేపటికే అవి మృతి చెందుతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి దుర్వాసన కూడా భరించలేని స్థాయిలో ఉందని చెబుతున్నారు. జూరాల నీటిపై ఆధారపడి జీవించే తమ ఉపాధి దెబ్బతింటోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి నీటి కాలుష్యానికి కారణాలను గుర్తించాలని కోరుతున్నారు.


తాగునీటిపై స్పష్టత ఇవ్వాలి

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు, తాగునీటి అవసరాలకు జూరాల జలాశయం కీలకంగా ఉంది. దీంతో నీటి రంగు మారడం, దుర్వాసన రావడం ప్రజల్లో మరింత ఆందోళనకు కారణమైంది. నీటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్న నేపథ్యంలో శాస్త్రీయంగా పరీక్షలు నిర్వహించి, ప్రజలకు వాస్తవ పరిస్థితిని వెల్లడించాలని పలువురు కోరుతున్నారు. అయితే మిషన్ భగీరథ అధికారులు మాత్రం తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. జలాశయం పైభాగంలో కనిపిస్తున్న పచ్చటి పొరకు తమకు సంబంధం లేదని, లోపలి భాగం నుంచి నీటిని సేకరిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే నీటి నమూనాలను పరీక్షించగా రసాయనాలు కలిసినట్లు గుర్తించలేదని అధికారులు తెలిపినట్లు సమాచారం. అయినప్పటికీ మరోసారి నీటి నమూనాలను పరీక్షించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.

సమగ్ర పరీక్షలు చేయాలని డిమాండ్

జూరాల నీటిని సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా పరీక్షించి, తాగునీరు, సాగునీరు, చేపల పెంపకానికి నీరు సురక్షితమేనా అనే విషయాన్ని స్పష్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు. నీరు ఆకుపచ్చగా మారడానికి గల కారణాలు, దుర్వాసనకు కారణమైన అంశాలు, చేపల మృతికి కారణాలను శాస్త్రీయంగా నిర్ధారించి ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Next Story