ఉద్దండాపూర్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలి:కల్వకుంట్ల కవిత

ఉద్దండాపూర్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలి:కల్వకుంట్ల కవిత
X

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు లో భాగమైన ఉద్దండపూర్ రిజర్వాయర్‌ను మంగళవారం నాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు.ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడుతూ వారి బాధలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్దండపూర్ నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఏ రోజు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందో ఆనాటి రేటు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 2021 నాటికే కటాఫ్ పెట్టటం సరికాదని, పరిహారం ఇచ్చే నాటికి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఇవ్వాల్సిందే అన్నారు. తప్పు బీఆర్‌ఎస్ దా, కాంగ్రెస్ దా అని కాదు. ఇక్కడ రైతులు నష్టపోతున్నారన్నారు. ప్రజలకు మంచి జరగాలని మాత్రమే నేను ఆలోచిస్తున్నా, ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు ఈ ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని కోరారు. గతంలో తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ లో నీళ్ల కరువు ఎలా ఉండేదో అందరికీ తెలుసని, వందల ఎకరాలు ఉన్న వారు కూడా నీళ్లు లేక వలస పోయారు. తెలంగాణ వచ్చాక కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా నీటి సౌలత్ మంచిగా చేసుకున్నామని పరోక్షంగా కే సి ఆర్ ను గుర్తుచేశారు.

ఇప్పుడు చెరువులు బాగా నిండుతున్నాయని, ఎండకాలంలో కూడా మహబూబ్ నగర్ జిల్లాలో చెరువులు కళకళలాడుతున్నయని తెలిపారు. తెలంగాణ వచ్చాక చాలా మంచి పనులు జరిగాయని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. కృష్ణా నది నీళ్లను వినియోగించుకోవాలని కేసీఆర్ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ చేపట్టారని గత ప్రభుత్వ ముఖ్యమంత్రి అని అన్నారు. ఉద్దండపూర్ రిజర్వాయర్ సహా అన్ని పనులు 80 శాతం వరకు గత ప్రభుత్వంలోనే అప్పుడే పూర్తయ్యాయని అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రేవంత్ రెడ్డి గెలిచి కూడా రెండేళ్లు అయినా ఇప్పటి వరకు ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయటం లేదన్నారు. తప్పు బీఆర్‌ఎస్ దా, కాంగ్రెస్ దా అన్నది పక్కన పెడితే ఇక్కడ ప్రజలు రైతులు నష్టపోతున్నారన్నారు. ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చిన ప్రజలు పెద్ద మనసు చేసుకొని ఒప్పుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. 2 వందల ఎకరాల్లో కోర్టు కేసులు ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ ను ఆలస్యం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నరని అన్నారు. పైగా నిర్వాసితులైన రైతులకు కటాఫ్ ఏజ్ 2021 న వరకే పెట్టడం అన్యాయమన్నారు. ఇప్పుడు 18 ఏళ్లు ఉన్నవారికి పరిహారం ఇవ్వమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రాజెక్ట్ పూర్తి చేస్తుందా లేదా? అని ప్రశించారు.

ప్రాజెక్ట్ నిర్మాణంలో స్పష్టంగా నాణ్యత లోపం తెలుస్తోందన్నారు. ప్రాజెక్ట్ పూర్తి చేస్తామంటే మాత్రం... ఎప్పుడు డబ్బులు ఇస్తే ఆనాటి రేటు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి పోతున్న యువకులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలన్నారు. పోలేపల్లి లో ఎకరాకు పన్నెండున్నర లక్షలు ఇచ్చి... మిగతా ప్రాజెక్టుల ముంపు గ్రామాల ప్రజలకు ఆరున్నర లక్షలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అన్నారు.అందరికీ ఒకటే ధర కట్టి ఇవ్వాలి. స్థానిక ఎమ్మెల్యే డిసెంబర్ 9వ తేదీలోపు నిర్వాసితులకు ఎకరాకు రూ. 25 లక్షల పరిహారం, రూ.25 లక్షల చొప్పున ప్యాకేజీ ఇప్పిస్తానని మాట ఇచ్చారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. ఇక్కడ ఇంకో 20 శాతం పనులు చేపిస్తే చాలు ప్రాజెక్ట్ పూర్తి అవుతుందన్నారు. నన్ను గెలిపిస్తే మహబూబ్ నగర్ కు మంచి చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఈ ప్రాజెక్ట్ ను పట్టించుకోవటం లేదన్నారు.ఇక్కడ ప్రాజెక్ట్ కట్టకుండా నారాయణ పేట- కొడంగల్ లిప్ట్ పేరుతో కొత్త ప్రాజెక్ట్ అంటున్నాడు. ఇంజనీర్లు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆయన ముందుకు పోతుండు. దీంతో జరగాల్సినంత మేలు జరగటం లేదు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ లో ఏనుగు వెళ్లి తోక చిక్కింది. ప్రాజెక్ట్ విషయంలో రాజకీయాలు వద్దని, ప్రజలకు మేలు చేయాలని హితువు చెప్పారు.

ఇళ్లు, భూములు కోల్పోతున్న రైతుల బాధ నాకు తెలుసని, వారి విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలని, కాంగ్రెస్ గెలిస్తే తమకు మేలు జరుగుతుందని ఆశ పెట్టుకొని ప్రజలు గెలిపించారని, ఇచ్చిన మాట నిలుపుకోవాలని, పెన్షన్, రైతు భరోసా, బోనస్, మహిళలకు రూ. 2500 సాయం అంశాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. ఉద్యమకారులకు ఇస్తామన్న డబ్బులు ఇస్తలేదని, షాద్ నగర్‌లో నన్ను కలిసిన మహిళలు ప్రభుత్వం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వటం లేదని చెబుతున్నారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిన వారందరికీ కూడా తులం బంగారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Tags

Next Story