ఆధారాలు లేని ఆరోపణలు చేయడంలో హరీశ్‌రావు దిట్ట: కడియం శ్రీహరి

ఆధారాలు లేని ఆరోపణలు చేయడంలో హరీశ్‌రావు దిట్ట: కడియం శ్రీహరి
X

బిఆర్‌ఎస్ అగ్ర నేత హరీశ్‌రావు ఆధారాలు లేని ఆరోపణలు చేయడంలో దిట్ట అని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. మంగళవారం మండలంలోని పల్లగుట్టలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమపై వచ్చే ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే హరీశ్‌రావు, కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధరమైన ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వందల ఎకరాల భూములు, వందల కోట్ల ఫాం హౌస్‌లు ఉన్నాయని.. కావాలనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ అంచనాలను రూ.1,100 కోట్ల నుంచి రూ.1,700 కోట్లకు పెంచారని కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలకు హరీశ్‌రావు సమాధానం చెప్పాలని అన్నారు. కవిత ఆరోపణలు చేస్తున్నా బిఆర్‌ఎస్ నాయకులంతా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బిఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి బిసిలకు రిజర్వేషన్లు కల్పించడం ఇష్టం లేదన్నారు.

అందుకే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిసి రిజర్వేషన్ల బిల్లును కేంద్రానికి పంపిస్తే పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం బిసి బిల్లును ఆమోదించిన 9వ షెడ్యూల్‌లో చేర్చితేనే రిజర్వేషన్ల అమలు సాధ్యమని తెలిపారు. దీనిని బిసి సంఘాల నాయకులు, ప్రజలు గమనించాలన్నారు. ఇదంతా తెలిసి కొంతమంది ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీల అభ్యర్థులు గెలిస్తే గ్రామాలభివృద్ధి కుంటుపడుతుందని అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పంచాయతీ ఎన్నికల తరువాత నియోజకవర్గ అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేస్తానన్నారు. అభివృద్ధిలో ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్న నియోజకవర్గానికి ప్రజలు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో చిల్పూర్ ఆలయ కమిటీ ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story