సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా రైతులకు అన్యాయం చేశారు1

సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా రైతులకు అన్యాయం చేశారు1
X

ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా రైతులకు అన్యాయం చేసిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రైతులను పంటలు వేయవద్దని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలో ఉండటానికి అర్హుడా? అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లాకు ఏళ్లుగా అన్యాయం చేసిన పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఇంద్రవెల్లిలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె మాట్లాడారు. విప్లవాలకు వన్నె తెచ్చిన ఇంద్రవెల్లి పుణ్యభూమికి పాదాభివందనం చేస్తున్నానని కవిత అన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన రామ్‌జీ గొండు, వన్నెల ఎల్లన్న, వెడమ రాము, శిడెం శింబు, కొమురం సూరు, జల్‌జంగల్‌జమీన్ నినాదంతో పోరాడిన కొమురం భీమ్‌ను స్మరించుకున్నారు. ఇంద్రవెల్లి ఘటనలో ఆదివాసీలపై కాల్పులు జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వమే వారి మరణాలకు కారణమని విమర్శించారు. అధికారంలోకి వస్తే ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి, కేవలం రూ.5 లక్షలే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.

నాగోబా తల్లి ఆశీస్సులతో తమ పార్టీ తొలి జెండా ఇక్కడి నుంచే ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అడవులు, సహజ సంపద, గోదావరి, ప్రాణహిత నదులు ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికీ పేదరికం నెలకొందని కవిత అన్నారు. సుమారు 750 గ్రామాల్లో కనీసం పాఠశాలలు కూడా లేవని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ.11 లక్షలుంటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రూ.2 లక్షలు కూడా లేదని విమర్శించారు. ఒకప్పుడు రాష్ట్రానికి అధిక ఆదాయం అందించిన జిల్లా ఇప్పుడు అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. రెండు నెలలకోసారి జిల్లాకు వస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మూడేళ్లలో రెండుసార్లే వచ్చారని, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆరోపించారు. కాగజ్‌నగర్ ప్రాంతంలో లక్షా ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, కేవలం ఆరు వేల ఎకరాలకే నీరు అందుతోందని కవిత పేర్కొన్నారు. చనాఖాకొరాటా ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.368 కోట్ల నుంచి రూ.2,100 కోట్లకు పెంచడంపై కవిత ప్రశ్నలు సంధించారు. ఇంత భారీగా వ్యయం పెరగడానికి కారణాలేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు.


బీఆర్‌ఎస్ రైతు గర్జనపై విమర్శలు

ఆదిలాబాద్‌లో రైతు గర్జన సభ నిర్వహించనున్న బీఆర్‌ఎస్ నాయకులు ముందుగా జిల్లాకు చేసిన అభివృద్ధిని వివరించాలని కవిత అన్నారు. పదేళ్ల పాలనలో ఒక్క యూనివర్సిటీ, ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయలేదని విమర్శించారు. సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లు కార్మికులకు తగిన ప్రయోజనాలు కల్పించలేదని, సీసీఐని తెరిపించడంలోనూ విఫలమయ్యారని ఆరోపించారు. పత్తి అధికంగా పండే ఆదిలాబాద్‌లో టెక్స్‌టైల్ పార్కును ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. సాగునీరు అందించని నాయకులు రైతు గర్జన పేరుతో ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని నిలదీశారు. సామాజిక న్యాయం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నామని కవిత అన్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు తమ పార్టీ తరఫున బీసీ అభ్యర్థులైన శ్రీకాంత్ గౌడ్, ఆకాశ్‌కు అవకాశం కల్పించామని తెలిపారు. రాజకీయ నేపథ్యం, ఆర్థిక బలం లేకపోయినా తెలంగాణ కోసం పనిచేసిన, విద్యావంతులైన యువకులను ప్రోత్సహించడం ద్వారా రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పారు. అన్ని పార్టీలు ఆదిలాబాద్ ప్రజలను నిర్లక్ష్యం చేశాయని ఆరోపిస్తూ, జిల్లా ప్రజల గొంతుకగా నిలిచి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని కవిత ప్రకటించారు. ఆదివాసీలు, ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆశీర్వాదంతో రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Tags

Next Story