కళ్యాణకట్ట, లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు

Kalyanakatta and Laddu counters
భక్తుల అభిప్రాయ సేకరణపై అదనపు ఈవో సమీక్ష
తిరుమల: తిరుమలోని కళ్యాణకట్ట, లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని అధికారులను టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భక్తులకు ఎప్పటికప్పుడు మరింత మెరుగైన సకర్యాలు కల్పించేందుకు టిటిడి అభిప్రాయ సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఐవిఆర్ఎస్, వాట్సాప్, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుండి క్రమంగా అభిప్రాయాలను సేకరించడం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో టిటిడి అదనపు ఇఒ సి.హెచ్.వెంకయ్య చౌదరి పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శనివారం ఉదయం భక్తుల నుండి అక్టోబర్ నెలలో సేకరించిన అభిప్రాయాలపై విభాగాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిప్రాయాలపై అధికారులతో చర్చిస్తూ పలు అదేశాలు జారీ చేశారు. కాలిబాట మార్గాల్లో పంచాయతీ, ఆరోగ్య విభాగాలు కలసి తరచూ తనిఖీలు నిర్వహించి ఆ మార్గాల్లోని దుకాణాల్లో వస్తువుల ధరలను పర్యవేక్షించాలన్నారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించేటప్పుడు అన్న ప్రసాదం సిబ్బంది చేతులకు తొడుగులు ధరించి ప్రసాదాలు వడ్డించాలని సూచించారు. భక్తులు చేతులు కడుగు ప్రదేశం, హాళ్లలో తడి లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. లగేజీ కౌంటర్ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు సకాలంలో లగేజీ అందేలా సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని చెప్పారు. భక్తులు గదుల కాషన్ డిపాజిట్ తిరిగిపొందడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిసెప్షన్ విభాగం చర్యలు తీసుకోవాలన్నారు. ఎటిసి నుండి ఆక్టోపస్ సర్కిల్ వరకు ఉండే క్యూలైన్లలో భక్తులకు అన్న ప్రసాదం, తాగునీరు అందేలా అధికారులు నిత్యం క్యూలైన్లను పర్యవేక్షించాలన్నారు. అదేవిధంగా క్యూలైన్లు, కంపార్ట్ మెంట్లలో పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని ఆదేశించారు.
అన్న ప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్, క్యూలైన్ల నిర్వహణ, లడ్డూ కౌంటర్ విభాగాలపై వచ్చిన భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. తదుపరి సమావేశంలో వాటి పురోగతిపై రిపోర్టు సమర్పించాలని చెప్పారు. అనంతరం గోపార్క్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి తిరుమలలోని పార్కింగ్ సమస్య పరిష్కారాలకు పార్కింగ్ యాప్ అభివృద్ధి, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రణాళిక, పార్కింగ్ ప్రీ బుకింగ్, నిర్దేశిత పార్కింగ్ జోన్లు గుర్తింపు, తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేశారు.ఈ సమావేశంలో టిటిడిలోని వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
