సమిసిన కామారెడ్డి కాంగ్రెస్ జగడం

చేతులు కలిపిన షబ్బీర్ చంద్రశేఖర్ రెడ్డి
చొరవ తీసుకున్న ఎంపీ మల్లు రవి
మన తెలంగాణ/హైదరాబాద్‌ః కామారెడ్డి కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య వివాదం ఎట్టకేలకు సామరస్యంగా సమిసింది. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పార్టీ స్థానిక నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం చేతులు కలిపి, ఇకమీదట కలిసి నడుస్తామని పార్టీ క్రమశిక్షణా కమిటీ ముందు హామీ ఇచాఇ్చరు. ఇరువురి మధ్య గత కొంత కాలంగా అధిపత్యపోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పైగా షబ్బీర్ అలీ ఇటీవల చేసిన వ్యాఖ్యల ఆడియో వైరల్ అయ్యింది. పార్టీలో పదవులు అమ్ముకునే సంస్కృతి రావడం బాధాకరమని అన్నట్లు ఓ ఆడియో చక్కర్లు కొట్టింది. ఈ ఆడియోలో మహిళలనూ కించపరిచే వ్యాఖ్యలు ఉన్నాయని పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ కూడా సీరియస్ అయ్యారని తెలిసింది.
ఈ నేపథ్యంలో పిసిసి క్రమశిక్షణా కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి ఇరువురికీ షోకాజ్ నోటీసులు పంపిస్తూ కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశించారు. దీంతో ఇరువురూ తమ అనుయాయులతో కలిసి ఆదివారం గాంధీ భవన్‌కు చేరుకున్నారు. కమిటీ చైర్మన్, సభ్యులు ఇరుపక్షాల వాదనలు విని, మీరు ఇలా చేస్తే పార్టీకి నష్టమని, అధికారంలో ఉన్నందున ప్రభుత్వంపైనా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదులు చేసుకోవడాన్నీ వారు తప్పుపట్టారు. ఇరుపక్షాలకూ వారు నచ్చజెప్పారు. దీంతో ఇకమీదట కలిసి పని చేస్తామని, కలిసి ముందుకు నడుస్తామని హామీ ఇస్తూ షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి చేతులు కలపడంతో కామారెడ్డి వివాదం సుఖాంతమైందని పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
-
Home
-
Menu
