కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
X

కామారెడ్డి జిల్లా, బిక్కనూర్ మండలం, జంగంపల్లి గ్రామం వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, బోనకల్ మండలం, ముష్టికుంట్ల గ్రామానికి చెందిన గద్దల ఆగన్ (భరత్ కుమార్)కు, ఆదిలాబాద్‌కు చెందిన జాశ్విన్ (25)తో 2020లో వివాహం జరిగింది. వారికి జోయల్ (4), జాట్సన్ (4 నెలలు) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈనెల 8వ తేదీన పిల్లలిద్దరిని తీసుకొని జాశ్విన్ నిద్ర చేసేందుకు పుట్టింటికి వెళ్లింది. ఆమె తండ్రి కిషన్ కామారెడ్డి చర్చి పాస్టర్‌గా పనిచేస్తున్నారు. దీంతో ఆ కుటుంబం ఆదిలాబాద్ నుండి కామారెడ్డి వచ్చింది. జాశ్విన్ తన ఇద్దరు పిల్లలను తీసుకుని కామారెడ్డిలోని తండ్రి వద్దకు వచ్చింది. బుధవారం చిన్న బాబుకు టీకా వేయించేందుకు సమీప బంధవు అయిన ఆశా వర్కర్ జంగంపల్లిలో ఉండటంతో అక్కడకు జాశ్విన్ స్కూటీపై ఇద్దరు పిల్లలతోపాటు తండ్రితో కలిసి వెళ్తోంది. అదే సమయంలో కామారెడ్డి జిల్లా 44వ నెంబర్ జాతీయ రహదారి బిక్కనూర్ మండలం, జంగంపల్లి శివారు వద్ద రాంగ్ రూట్‌లో వచ్చిన టిప్పర్ స్కూటీని ఢీకొంది.

ఈ ప్రమాదంలో కిషన్ (50), అతని కూతురు జాశ్విన్, మనవడు జోయల్ అక్కడిక్కక్కడే మృతి చెందగా 4 నెలల బాబు జాట్సన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతురాలు జాశ్విన్ భర్త ఆగన్.. చింతకాని మండలం, చిన్నమండల గ్రామంలో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందటంతో విషాదఛాయలు అలుముకొన్నాయి. కాగా, జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరగడంతో గ్రామస్థులు, వాహనదారులు గుమిగూడడంతో, కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, ట్రాఫిక్‌ను క్లియర్ చేయించారు. మృతదేహాలపు మార్చురీకి తరలించారు. మృతులంతా ఖమ్మం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.

Tags

Next Story