కెసిఆర్‌పై ప్రశ్నలవర్షం

కెసిఆర్‌పై ప్రశ్నలవర్షం
X

మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆదివారం సుదీర్ఘంగా విచారించింది. మధ్యా హ్నం 3 గంటలకు నందినగర్‌లోని కెసిఆర్ నివాసంలో సిట్ అధికారులు 4.45 గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం కెసిఆర్ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు. విచారణ ముగిసిత తర్వాత కెసిఆర్ నివాసం నుంచి సిట్ అధికారులు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఫోన్ ట్యా పింగ్ ఆదేశాలు ఎవరి సూచనలతో జారీ అయ్యాయన్న విషయంపై, నిర్ణయ ప్రక్రియలో కెసిఆర్ పాత్రపై సిట్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఈ విచారణలో కెసిఆర్‌కు సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించిన ట్లు తెలిసింది. గతంలో సాక్షుల వాంగ్మూలాల ఆ ధారంగా కెసిఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించిన ట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్‌పై తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కెసిఆర్ సిట్ విచారణలో చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామంపై ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ అధికారులు నివేదిస్తారని, అది వారి బాధ్యత అని చెప్పినట్లు తెలిసింది. ఆ సమాచారం ఎలా సేకరించారో సిఎంకు అవసరం లేదు కదా..? అని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం.

ఫోన్ ట్యాపింగ్ ఎప్పటినుంచి మొదలైంది..?

ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు జారీ చేశారా..? అని కెసిఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇంటెలిజెన్స్ అధికారులకు మీరు స్వయంగా ఆదేశాలు జారీ చేశారా..? అనే ప్రశ్నను స్పష్టంగా అడిగినట్లు సమాచారం. ఈ అంశంపై కెసిఆర్ నుంచి స్పష్టత తీసుకునేందుకు సిట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పటి నుంచి ప్రారంభమైందనే విషయంపై సిట్ అధికారులు ప్రత్యేకంగా ఆరా తీసినట్లు సమాచారం. ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారు.. అది సాధారణ భద్రత కోసమా... లేక రాజకీయ అవసరాల కోసమా..అంటూ పలు అనుబంధ ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారా..వారి ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చారా..అంటూ సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ విచారణలో అత్యంత కీలకంగా మారిన ప్రశ్న ఇదేనని సమాచారం.

ప్రభాకర్ రావు పదవీకాలం పొడగింపుపై విచారణ..

ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వ్యవహారం కూడా సిట్ అధికారుల విచారణలో ప్రధాన అంశంగా మారింది. పదవీకాలం ముగిసిన ప్రభాకర్ రావుకు మళ్లీ పదవిని ఎందుకు పొడిగించారు...ఆ నిర్ణయం వెనుక కారణాలు ఏంటి..? అంటూ కెసిఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఒకే వ్యక్తికి రెండు కీలక పోస్టులు ఎందుకు.. పరిపాలనా నియమావళికి విరుద్ధంగా ఒకే వ్యక్తికి రెండు కీలక బాధ్యతలు అప్పగించడంపై కూడా సిట్ అధికారులు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఒకే వ్యక్తికి రెండు కీలక పోస్టులు ఎందుకు అప్పగించారు.. అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉందా..? అనే కోణంలో విచారణ సాగినట్లు తెలిసింది.

ఎంఎల్‌ఎ కొనుగోలు కేసులో సమాచారం ఎలా వచ్చింది..?

ఎంఎల్‌ఎ కొనుగోలు కేసు సమయంలో తీసుకున్న చర్యలపై కూడా కెసిఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. మీ పార్టీ ఎంఎల్‌ఎలు ఇతర పార్టీలకు వెళ్తున్నారని మీకు ఎలా తెలిసింది.. ఆ సమాచారం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వచ్చిందా..?అన్న అనుమానాలతో అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. పార్టీ నిధులతో ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలు చేశారా..? అని సెట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు పార్టీ నిధులు కేటాయించారా.. ప్రభుత్వ నిధులు కాకుండా పార్టీ డబ్బులు ఎందుకు ఉపయోగించారు..? అంటూ సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ ఫండ్ నుంచి ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేయలేదని, ఆ అవసరం పార్టీకి లేదని చెప్పినట్లు తెలిసింది. బిఆర్‌ఎస్ పార్టీకీ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన వారి ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ జాబితాలో ఎందుకు ఉన్నాయనే అంశంపై కెసిఆర్ వివరణ కోరినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ నిర్ణయం ఎవరు తీసుకున్నారు..ఎలాంటి అధికారిక ఫైళ్లు ఉన్నాయి.. భద్రతా కారణాల పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం ట్యాపింగ్ జరిగిందా..? అన్న అంశాలపై సిట్ అధికారులు సమగ్ర విచారణ జరిపినట్లు సమాచారం.

కార్యకర్తలకు కెసిఆర్ అభివాదం

సిట్ విచారణ ముగిసిన తర్వాత బిఆర్‌ఎస్ పార్టీ నేతలతో భేటీ అయిన అనంతరం అధినేత బయటకు వచ్చి పార్టీ కార్యకర్తలకు అభివాదం చేశారు. నందినగర్‌లోని కెసిఆర్ నివాసానికి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు సహా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.పోలీసుల బారీకేడ్లు తోసుకుంటూ కెసిఆర్ నివాసానికి కార్యకర్తలు పరుగులు తీశారు.జై కెసిఆర్, సిఎం..సిఎం అంటూ నినాదాలు చేశారు.

Tags

Next Story