గంగమ్మ ఒడికి గౌరీపుత్రుడు

గంగమ్మ ఒడికి గౌరీపుత్రుడు
X

మన తెలంగాణ/ సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ జనసంద్రమైంది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో నగర రహదారులు కిక్కిరిసిపోయాయి. హుస్సేన్‌సాగర ప్రాంతమంతా భక్తులు చేసే గణనాథుల జేజేలతో మారుమోగింది. డిజె సౌండ్స్‌తో యువతల కేరింతలతో, నృత్యాలతో భాగ్యనగరం ఊగిపోయింది. భక్తుల అత్యంత ఆనందోత్సాహాల నడుమ, శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో గణపతుల శోభాయాత్ర జరిగింది. గణనాథుడి శోభయాత్ర శుక్రవారం అత్యంత వైభవంగా మహానగరంలో సాగింది. ఉ. 9.37 గం.లకు ప్రారంభమైన

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర హుస్సేన్ సాగర్‌లో మ.2.25 గం.లకు గంగమ్మ ఒడిలోకి చేరడంతో మహా గణనాథుడి నిమజ్జనం పూర్తయింది. బాలాపూర్ గణేశుడి శోభయాత్ర ఉ. 7. గం.లకు ప్రారంభమై పాత నగరం మీదుగా సాగుతూ హుస్సేన్ సాగర్‌లో సా. 5 గం.లకు గణనాథుడి నిమజ్జనంతో పూర్తయ్యింది. ఇక నగరం, శివారు నలుమూలల వినాయక విగ్రహాలు వాటికి సమీపంలోని చెరువులల్లో నిమజ్జనం సాగుతూనే ఉంది. జీహెచ్‌ఎంసి ప్రాంతంలో 1,05,600కు పైగా గ ణపతులు నిమజ్జనం కాగా ఇందులో శుక్రవారం భారీ గణనాథుల విగ్రహాలు 6,050 విగ్రహాలు నిమజ్జనం జరిగినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. మరో 4,000 విగ్రహాలు శనివారం నిమజ్జనం చేస్తున్నట్లు తెలిపారు.

భారీ బందోబస్తు..

హైదరాబాద్ మహానగరంలో గణనాథుల నిమజ్జనం సజావుగా సాగేందుకు ప్రభుత్వ విభాగాలు ముఖ్యంగా జీహెచ్‌ఎంసి, పోలీసు, హైడ్రా, విద్యుత్, జలమండలి, పర్యాటకం, ఆర్టీసిలతో పాటు ఇతర విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు, బందోబస్తు, సౌకర్యాలను కల్పించాయి. నిమజ్జనం కోసం 110 స్టాటిక్ క్రేన్లు, 170 మొబైల్ క్రేన్లు అందుబాటులో ఏర్పాటు చేశారు. పీపుల్ ప్లాజాలో 9, ఎన్టీఆర్ మార్గ్‌లో 10 క్రేన్లు ఏర్పాటుచేశారు. పోలీసులతో సమన్వయం కోసం 12 జాయింట్ కంట్రోల్ రూమ్స్ ఇందులో శోభాయాత్ర మార్గంలో ప్రతి 3-4 కి.మీ.లకు గణేశ్ యాక్షన్ టీంలను నియమించారు. 24 గంటల పాటు 770 మంది పారిశుద్ధ్య కార్మికులు, చెత్త తొలగింపు కోసం మొత్తం

6 వేల మంది స్వీపింగ్ సిబ్బంది విధులను నిర్వర్తిస్తున్నారు. 287 మొబైల్ టా యిలెట్లు, 4.91 లక్షల చెత్త సేకరణ సంచులు, 43,270 తాత్కాలిక లైట్లు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం 137 ప్రత్యేక తాగునీటి శిబిరాలు ఏర్పాటు చేశారు. 90 బేబీ పాండ్స్ వద్ద కూడా తాగునీటి సదుపాయం కల్పించారు. ట్యాంక్బండ్, సెక్రటేరియట్ పరిసరాల్లో 12 ప్రత్యేక వాటర్ క్యాంపులు ఏర్పాటు చేయగా.. మొత్తం 40 లక్షల వాటర్ ప్యాకెట్లను పంచేందుకు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్లో 523 మంది అదనపు పోలీసు బలగాలు 24 నిఘా డ్రోన్లు మోహరించారు. భక్తుల రవాణా కోసం టీజీఎస్ ఆర్టీసీ 24 గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 700 ప్రత్యేక బస్సులను నడిపిందనేది అధికారుల సమాచారం.

హైడ్రా ప్రత్యేక చర్యలు

నిమజ్జన కార్యక్రమాలు జరిగే చెరువుల వద్ద హైడ్రా సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ళను ఏర్పాటు చేశారు. చెరువుల వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లుచేశారు. కమిషనర్ రంగనాథ్ శివారులోని చెరువులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఐడిఎల్, కూకట్‌పల్లి చెరువులను ప్రత్యక్షంగా తనిఖీచేశారు.

Tags

Next Story