ప్రమాదంలో కిడ్నీ

ప్రమాదంలో కిడ్నీ
X

జోగులాంబ గద్వాల జిల్లాలో గణనీయంగా పెరుగుతున్న డయాలసిస్ రోగుల సంఖ్య

మూడేళ్లలో రెండింతలు పెరిగిన పేషెంట్లు విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్స్ రాస్తున్న ఆర్‌ఎంపిలు

నిపుణుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడడంతో దెబ్బతింటున్న మూత్రపిండాలు డయాలసిస్

కేంద్రాలు పెంచాలని రోగుల అభ్యర్థనలు పింఛన్ కోసం కొత్త రోగుల ఎదురుచూపులు

ఎండి.ముస్తఫా

మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి: జో గులాంబ గద్వాల జిల్లాలో రోజురోజు కు డయాలసిస్ రోగులు పెరుగుతున్నా రు. మూడేళ్ల క్రితం కేవలం 50మంది పేషెంట్స్ ఉండగా.. ప్రస్తుతం 150 మందికిపైగానే ఉన్నట్లు గద్వాల హాస్పిటల్‌లోని డయాలసిస్ సెంటర్ రికార్డుల ద్వారా తెలుస్తోంది. మారుతున్న ప్రజల జీవన శైలి, హైబీపీ, షుగర్, విచ్చలవిడి గా పెయిన్ కిల్లర్స్ వాడకంతో కిడ్నీలు ఫెయిలై డయాలసిస్ చేసుకునే పరిస్థితి వస్తోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. హై బీపీ, షుగర్, జీవన విధానా న్ని మార్పు చేసుకొని పెయిన్ కిల్లర్స్ వా డకుండా ఉంటే ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని

నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

డయాలసిస్ పేషెంట్లకు ప్రస్తుతం గద్వాల, ఆలంపూర్ హాస్పిటల్స్‌లో సేవలు అందిస్తున్నారు. గద్వాలలోని ప్రైవేటు హాస్పిటల్ లో కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగానే డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం సరిపడా డయాసిస్ మిషన్లు ఉన్నప్పటికీ 24 గంటలపాటు పనిచేయాల్సి వస్తుండడంతో డయాలసిస్ సెంటర్లను పెంచాలని రోగులు కోరుతున్నారు. చాలా మందికి డయాలసిస్ పేషెంట్లకు పింఛన్లు రావడంలేదు. రోజు తప్పించి రోజు డయాలసిస్ చేసుకున్న తర్వాత పౌష్టికారం కోసం కొన్నేళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నారు.

హై బీపీ, షుగర్, పెయిన్ కిల్లర్స్ వల్లే

హై బీపీ, షుగర్, పెయిన్ కిల్లర్స్ వినియోగం వల్లనే చాలామంది కిడ్నీలు చెడిపోయి డయాలసిస్‌కు వెళ్తున్నారని వైద్య నిపుణులు తెలిపారు. లిక్కర్‌కు అడిక్ట్ అయిన వారిలో కూడా కిడ్నీలు ఫెయిలైన ఘటనలు ఉన్నాయి. హై బీపీ, షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకొని మాత్రలు వాడితే ఇబ్బంది ఉండదన్నారు. గ్రామాల్లో ఆర్‌ఎంపీలు విచ్చలవిడిగా పేషెంట్లకు పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం వల్ల కిడ్నీలు చెడిపోతున్నాయని పలువురు ఆరోపించారు. నొప్పుల నివారణ కోసం పెయిన్ కిల్లర్స్ వాడడంతో కిడ్నీలు దెబ్బతింటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో సంబంధిత వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్ వాడొద్దని.. ఒకవేళ ప్రిస్క్రిప్షన్ ఉన్నా కూడా మూడు రోజులకు మించి పెయిన్ కిల్లర్స్ వాడకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ గ్రామాల్లో ఆర్‌ఎంపీలు వారాలకొద్దీ టాబ్లెట్లు రాసి ఇవ్వడంతో వాటిని వినియోగిస్తున్నారు. దీంతో కిడ్నీ రోగులు పెరుగుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

నాలుగు షిఫ్ట్‌ల్లో వైద్య సేవలు

ప్రస్తుతం నాలుగు షిఫ్ట్‌ల్లో పేషెంట్లకు డయాలసిస్ చేస్తున్నారు. గద్వాల హాస్పిటల్‌లో మొత్తం 95 మందికి.. ఆలంపూర్ ఆస్పత్రిలో 30 మందికి.. ప్రైవేట్ హాస్పిటల్‌లో 30 మందికి డయాలసిస్ అందిస్తున్నారు. గద్వాల హాస్పిటల్‌లో నాలుగు షిఫ్ట్‌ల్లో ఉదయం 6 నుంచి 10 గంటలు.. 11 నుంచి 3.. సాయంత్రం 4 నుంచి 7.. రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పేషెంట్లకు రోజు తప్పించి రోజు డయాలసిస్ చేస్తున్నారు.

డయాలసిస్ కేంద్రాలు పెంచాలి

జిల్లాలో కేవలం మూడు చోట్ల డయాలసిస్ కేంద్రాలున్నాయి. 30 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలోనే డయాలసిస్ కేంద్రాలను పెడితే పేషంట్లతోపాటు అత్యవసర సమయంలో ఇతరులకు కూడా ఉపయోగపడుతుందే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డయాలసిస్ కేంద్రాలను పెంచి కేవలం పగలు మాత్రమే డయాలసిస్ చేయాలని రోగులు కోరుతున్నారు. డయాలసిస్ పేషెంట్లకు ప్రస్తుతం మూడు సెంటర్లలో ఉచితంగా సేవలు అందిస్తున్నారు.ప్రైవేట్ హాస్పిటల్‌లో ఒకసారి డయాలసిస్ చేసుకోవాలంటే రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వం ఒక్కొక్క పేషెంట్ కు రూ.1600 నుంచి రూ.2 వేల వరకు ఖర్చు పెడుతోంది.

పింఛను కోసం ఎదురుచూపులు

డయాలసిస్ పేషెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం పింఛను రూ.2 వేలు ఇస్తోంది. ప్రస్తుతం కేవలం 50 మంది(పాతవారు)కి పింఛను వస్తోంది. మిగతా 100 మంది రోగులు పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఫ్రీ బస్ పాస్ మాత్రమే ఇస్తున్నారని, పింఛను కూడా ఇవ్వాలని పలువురు రోగులు కోరుతున్నారు.

Tags

Next Story