కెసిఆర్‌ను అరెస్ట్ చేసే దమ్ముందా?

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈగ, దోమ వాలనీయడం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కెసిఆర్‌ను అరెస్టు చేసే దమ్ము, ధైర్యం లేకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఉత్తరకుమార ప్రగల్బాలు పలుకుతున్నారని ఆయన విమర్శించారు. కల్వకుంట్ల కిషన్ రావు అంటూ తనపై సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. సమావేశంలో పార్టీ ముఖ్యఅధికార ప్రతినిధి ఎన్‌వి సుభాష్, ఇతర నాయకులు టి. వీరేందర్ గౌడ్, జి. వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కెసిఆర్‌ను మరిపించేలా సిఎం డూప్ డైలాగులు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.
సిఎం అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో శిక్షణ పొందినా హర్డ్-వర్డ్ మానలేదని ఆయన విమర్శించారు. కెసిఆర్, రేవంత్ రెడ్డిని భరించాల్సిన దురదృష్టం రాష్ట్ర ప్రజలకు పట్టిందని ఆయన ఆవేదన చెందారు. అధికారంలోకి రాగానే కెసిఆర్ అవినీతి అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తామని చర్లపల్లి జైలుకు పంపిస్తామని, కళ్ళు పీకి గోలీలు ఆడుకుంటామని, పేగులు పీకి మెడలో వేసుకుంటామని, చిప్పకూడు తినిపిస్తామని, అప్పటి బిఆర్‌ఎస్ మంత్రులపైనా విచారణ జరిపించి, అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పి, ముఖ్యమంత్రి అయిన తర్వాత కెసిఆర్‌పై ఈగ, దోమ వాలనీయడం లేదన్నారు. ‘కెసిఆర్ కుంభకోణాలపై విచారణ జరిపించవద్దని ఎవరు చెప్పారు.? నేను చెప్పానా, రాహుల్ గాంధీ చెప్పారా? విచారణ జరిపి చర్యలు తీసుకోకుండా ఏ శక్తి అడ్డుపడుతున్నదో సిఎం స్పష్టం చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. తనపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలి వేస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
సిఎం డూప్ డైలాగులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డూప్, డమ్మీ డైలాగులు కొడుతున్నారని ఆయన విమర్శించారు. సినీమాల్లో డూప్‌ల డైలాగులు ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డూప్ డైలాగులు కొడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. నేను తిట్టినట్లు, నువ్వు ఏడ్చినట్లు నటించు అన్నట్లు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు పరస్పరం విమర్శించుకుంటున్నారని ఆయన తెలిపారు. రాబోయే మూడేళ్ళూ తాము ఓపిక పడతామని, అధికారంలోకి రాగానే తమ సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు. ఇరు పార్టీలు అధికారంలో చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
శ్వేతపత్రాలు విడుదల చేయాలి..
కేంద్రం నుంచి నిధులు ఏమీ రావడం లేదని ముఖ్యమంత్రి చేసిన విమర్శను ఆయన తోసిపుచ్చారు. మున్సిపాలిటీలకు, ఇతర అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం నుంచి విడుదలైన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, ఆడ బిడ్డకు తులం బంగారం, విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామన్న హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని, సభల్లో ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో మజ్లీస్‌ను ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ఎత్తుగడలు వేస్తున్నాయని ఆయన విమర్శించారు. రావు అయినా రెడ్డి అయినా తమ వద్దకు రావాల్సిందేనని మజ్లీస్ శాసనసభాపక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారని ఆయన చెప్పారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వరాదని గతంలో హైకోర్టు కొట్టివేసినా, మళ్లీ రేవంత్ రెడ్డి మతపరమైన రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పి, బిజెపిని గెలిపించాలని ఆయన కోరారు.
రెచ్చగొట్టే ప్రసంగాలపై..
రెచ్చగొట్టేలా ప్రసంగించే వారిపై చర్యలు తీసుకునేందుకు అసెంబ్లీలో చట్టం చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను విలేకరి ప్రశ్నించగా, అలాంటి కేసు పెట్టాలంటే తొలుత ముఖ్యమంత్రిపైనే పెట్టాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అంటేనే ముస్లింలని, ముస్లింలు అంటేనే కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో చెప్పి మత రాజకీయం చేశారని ఆయన విమర్శించారు.
ఎఫ్‌ఎస్‌ఎల్‌లో మంటలపై అనుమానం
ఇదిలాఉండగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో మంటలు చెలరేగి ఫైళ్ళు కాలిపోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇందులో ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వంటి కీలకమైన ఫైళ్ళు, విచారణ ఆధారాలు ఉంటాయని ఆయన తెలిపారు.
-
Home
-
Menu
