ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ క్షమాపణ చెప్పాలి: కిషన్ రెడ్డి

Kishan Reddy comments Revanth Reddy
X

Kishan Reddy comments Revanth Reddy

ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాపై అసభ్యకరమైన, అభ్యంతరకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికైన ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాను రాహుల్ గాంధీ ‘దేశద్రోహి’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోట్లాది మంది నమ్మకంతో ఓటేసి గెలిపించిన వారిపై రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఆయన మానసిక స్థితిని, ఆయన అసహనాన్ని తెలియజేస్తోందని ఆయన విమర్శించారు. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతుండటంతో మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారనిపిస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఒక పార్టీ జెండాతో గెలిచి వేరే పార్టీలోకి ఫిరాయించిన

దానం నాగేందర్‌పై సుప్రీం కోర్టు అనర్హత వేటు వేయడాన్ని స్వాగతించి, క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. అదే రోజు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వేరే పార్టీల టికెట్లపై ఎన్నికైన 10 మంది ఎమ్మెల్యేలను రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని ఆయన విమర్శించారు. దానం నాగేందర్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగానే, రాహుల్ గాంధీ ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించారని ఆయన విమర్శించారు.ప్రజల నమ్మకాన్ని గెలుచుకోలేకపోవడంతో ఎన్నికల్లో ఓడిపోతూ నిరాశ నిస్పృహలకు గురవుతున్న కాంగ్రెస్ నాయకులు, రాహుల్ గాంధీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజలు వీరిని ఛీత్కరించినప్పుడల్లా ఏం చేయాలో పాలుపోక రాజ్యాంగబద్ధ సంస్థలపై వారి అసహనాన్ని వెల్లగక్కుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

Tags

Next Story