జూరాలకు కృష్ణా జలాలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వానాకాలం పంటలను కాపాడటంతో పాటు తాగునీటి అవసరాలు తీర్చేందుకు కృష్ణా జలాలను జూరాల ప్రాజెక్టుకు విడుదల చేయించినట్లు రాష్ట్ర అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం వనపర్తి కలెక్టరేట్‌లో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులతో కృష్ణా జలాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, తాగునీటి అవసరాల కోసం సుమారు 18.19 టీఎంసీల నీరు అవసరమవుతుందని తెలిపారు.
ప్రస్తుతం జూరాలలో ఉన్న సుమారు 7 టీఎంసీల నీటితో పాటు కర్ణాటక నుంచి వచ్చే నీరు, ఇతర వరద జలాలను జాగ్రత్తగా వినియోగిస్తే పంటలు, తాగునీటి అవసరాలను తీర్చవచ్చన్నారు. డిస్ట్రిబ్యూటరీల వారీగా సమానంగా నీటిని విడుదల చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. లష్కర్లు, ఇతర సిబ్బందిని వినియోగించి ఆన్-ఆఫ్ పద్ధతిలో క్రమబద్ధంగా నీటి సరఫరా చేయాలని సూచించారు. రైతులకు ముందుగానే వారాబందీపై సమాచారం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. నవంబర్ 27 వరకు ఈ విధానంలో నీటిని విడుదల చేస్తే వానాకాలం పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
కర్ణాటక సీఎంకు ధన్యవాదాలు
కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించిన అనంతరం ఎమ్మెల్యేల బృందం కర్ణాటకకు వెళ్లి నీటి విడుదలపై చర్చించిందని జూపల్లి తెలిపారు. అనంతరం జూరాలకు కృష్ణా జలాలు విడుదల చేయించినందుకు కర్ణాటక సీఎంకు జిల్లా రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతుల పంటలు ఎండిపోకుండా అందుబాటులో ఉన్న నీటిని అత్యవసర ప్రాంతాలకు వినియోగించాలని మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు సూచించారు. కోయిల్‌సాగర్ నింపేందుకు రెండు మోటార్లు వెంటనే ఆన్ చేయాలని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
-
Home
-
Menu
