రేవంత్ ఒక ‘ఆవారా’

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చకుండా పచ్చి అబద్ధాలతో మోసం చేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ‘ఆవారా’లా ప్రవర్తిస్తూ అసెంబ్లీని ‘బూతుల సభ’గా మార్చారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం జనగామ ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ‘నూతన సర్పంచ్‌ల అభినందన సభ’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు జనగామ బైపాస్ నుండి భ్రమరాంబ కన్వెన్షన్ హాల్ వరకు పార్టీ కార్యకర్తలు నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో కెటిఆర్ మాట్లాడుతూ.. ‘జనగామ కార్యకర్తల జోష్ చూస్తుంటే కెసిఆర్ మళ్ళీ సిఎం అయినట్లే అనిపిస్తోంది. తెలంగాణను మొలిపించిన మొగోడు కెసిఆర్. రేవంత్‌రెడ్డి నువ్వు కెసిఆర్ కాలి ధూళికి కూడా సరిపోవు. కెసిఆర్ ఒక ప్రెస్‌మీట్ పెడితేనే నీ లాగు తడిసింది, ఇక ఆయన అసెంబ్లీకి వస్తే నువ్వు ఊరుకోవాల్సిందే’ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్ర లేని రేవంత్‌రెడ్డి, ఢిల్లీకి నెలకు రూ.100 కోట్లు పంపి సిఎం సీటు కాపాడుకుంటున్నారని విమర్శించారు.
రాహుల్ గాంధీ ఒక లీడర్ కాదు, కేవలం టివిల్లో వార్తలు చదివే ‘రీడర్’ అని, అశోక్‌నగర్ వచ్చి 2 లక్షల ఉద్యోగాలంటూ నిరుద్యోగులను మోసం చేసినందుకు రేవంత్, రాహుల్ ఇద్దరినీ ఉరితీయాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రికి అ, ఆ లు రావు.. ఇ, ఈ లు తెలియవు. ఏ వాగు ఎక్కడుందో, దేవాదుల నీళ్లు ఎక్కడికి వస్తాయో తెలియని అజ్ఞాని.. భాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందని చెప్పిన దద్దమ్మ’ నువ్వు నీళ్ల గురించి మాకు చెబుతావా?‘ అని ప్రశ్నించారు. పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును తెచ్చుకున్నట్లు ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయారని విచారం వ్యక్తం చేశారు. కెసిఆర్ హయాంలో రైతుబంధు, రైతుబీమాతో కళకళలాడిన వ్యవసాయం, ఇప్పుడు యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టే దుస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని, ‘బంగారం ఇచ్చే మాట దేవుడెరుగు, ఉన్న పుస్తెలతాళ్లు ఎత్తుకెళ్లే రకం రేవంత్‌రెడ్డి‘ అని మండిపడ్డారు. పార్టీని కష్టకాలంలో వదిలేసి వెళ్ళిన కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగారు.
‘తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన కడియంను కెసిఆర్ చేరదీస్తే, ఇప్పుడు చిల్లరగాడు రేవంత్ సంక నాకేందుకు వెళ్ళిన దొంగ‘ అని ధ్వజమెత్తారు. ఎందరు పోయినా నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలదే అసలు విజయమని అన్నారు. జిల్లాలో 150 మంది సర్పంచ్‌లను గెలిపించుకున్న కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ‘సర్పంచ్‌ల గెలుపు క్వార్టర్ ఫైనల్ అయితే, జిల్లా పరిషత్ సెమీ ఫైనల్, అసెంబ్లీ ఫైనల్ అవుతుంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండాకు గుద్దుడే గుద్దుడు‘ అని పిలుపునిచ్చారు. ఈ అభినందన సభలో మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు భారీ సంఖ్యలో నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
