కాంగ్రెస్ కు కౌంట్ డౌన్

కాంగ్రెస్ కు కౌంట్ డౌన్
X

ఇంకా ఉన్నది 500 రోజులే

రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదు.. పర్సెంటేజీల పాలన

రేవంత్, పొంగులేటి బిడ్డల కోసం ఇంటర్ విద్య విలీనం

గాలి మాటలు చెప్పి.. గాలి మోటర్‌లో తిరుగుతున్న సీఎం

ఈ మూడేళ్లు తిట్లతోనే నెట్టుకొచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి

ఢిల్లీకి గులాములు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు

ఫ్యూచర్ సిటీ కాదు.. ఫ్యూచర్ ఉన్న సిటీ వరంగల్

కాకతీయ కళాతోరణం తీసిన కాంగ్రెస్‌ను ఖతం చేయండి

హనుమకొండ జనచైతన్య సభలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదని, పర్సెంటేజీ పాలన అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తమ బిడ్డల బిజినెస్ కోసం ఇంటర్ విద్యను రాష్ట్రంలో పాఠశాల విద్యలో విలీనం చేశారని ఆరోపించారు. హన్మకొండలోని కేడీసీ మైదానంలో ఆదివారం రాత్రి నిర్వహించిన జనచైతన్య సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సభకు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వరంగల్ గడ్డ ఉద్యమాలకు పెట్టింది పేరని, అలాంటి వరంగల్‌తో తనకు విడదీయరాని అనుబంధం ఉన్నదని అన్నారు. ఉద్యమ సమయంలో వరంగల్ సెంట్రల్ జైలుకు వెళ్లిన జ్ఞాపకాలు ఇప్పటికీ ఉన్నాయని చెప్పారు. అలాంటి వరంగల్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిలో నిర్లక్ష్యం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాయమాటలు చెప్పి 420హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కారని అన్నారు. పౌరుషాల గడ్డగా ఉన్న వరంగల్‌లో మూడేళ్లకాలంలో ఒక్క చిన్న పనిని కూడా చేసి చూపించలేకపోయారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తమ బిడ్డల కోసం విద్యను వ్యాపారం చేసేందుకు ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేస్తున్నారని ఆరోపించారు. వారు చేస్తున్న వ్యాపారాలకు ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ పాలసీలు అడ్డుగా వస్తున్నాయని, అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.

కేసీఆర్ పాలనలో వరంగల్ అభివృద్ధి

కేసీఆర్ పాలనలో టెక్స్‌టైల్ పార్కు, 24 అంతస్తులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తే.. రేవంత్‌రెడ్డి తన ప్రైవేటు ఆసుపత్రి మెడికవర్‌ను ప్రారంభించి పేదల ఆసుపత్రిని వదిలేశారని ధ్వజమెత్తారు. వరంగల్ ఆసుపత్రి ప్రపంచంలోనే ఆదర్శంగా ఉన్న భవనం అని అన్నారు. 24 అంతస్తులతో 2,400 పడకలతో ఏర్పాటు చేసిన ఆసుపత్రి పనులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధి చెందాలని ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చామని తెలిపారు. వాటిని పెంచాల్సింది పోయి ఉన్న కంపెనీలు వెళ్లిపోయే పరిస్థితులు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

మాజీ మంత్రి కొండా సురేఖ నిజాలు మాట్లాడితే మంచిరేవుల దేవాలయ భూముల కోసం ఆమె మంత్రి పదవిని తీసేశారని కేటీఆర్ అన్నారు. ఆమె కూతురు సుష్మిత పారిశ్రామికవేత్తల తలకు రేవంత్ తమ్ముళ్లు తుపాకీ పెట్టి బెదిరించారని చెప్పిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, అనిరుద్‌రెడ్డిలు సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్ల వరకు దోచుకున్నారని ఆరోపించారని అన్నారు. అలాంటి ముఖ్యమంత్రి ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు. చేసిన పనుల కాంట్రాక్టు బిల్లుల కోసం 20శాతం కమిషన్ ఇవ్వాలని చెబుతున్న విధానంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారని కేటీఆర్ తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానంటున్న ముఖ్యమంత్రి ముందుగా వారిని లక్షాధికారులను చేయాలని సూచించారు.

ఇచ్చిన హామీల సంగతేందీ?

అధికారంలోకి వచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు రూ.4,000 పెన్షన్, రూ.2,500 పెన్షన్, తులం బంగారం వంటి పథకాలను ప్రకటించి ఏ ఒక్కటీ అమలు చేయలేదని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటివరకు ఒక్కో మహిళకు రూ.87,500 బాకీ పడ్డారని, తాను ఇస్తానన్న హామీల్లో భాగంగా 1,67,000 మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.1,50,000 బాకీ ఉందని తెలిపారు. దమ్ముంటే ప్రతి మహిళ ఖాతాలో ఆ మొత్తాన్ని జమ చేసి చూపించాలని సవాల్ విసిరారు. గాలి మాటలు చెప్పి గాలిమోటర్‌లో తిరుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరంగల్‌కు ఒక్క అభివృద్ధి పనినైనా తీసుకొచ్చానని చెప్పగలరా అని నిలదీశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో మూడు కంపెనీలు ప్రస్తుతం అద్భుతమైన ఉత్పత్తి సాధిస్తున్నాయని చెప్పారు. కాలేజీ కళాక్షేత్రాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మిస్తే.. అందులో ఆఫీసును ఏర్పాటు చేస్తామని చెప్పారని కేటీఆర్ తెలిపారు. దీనిపై బీఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసి జనచైతన్య సభ నిర్వహిస్తున్నామని తెలుసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని అన్నారు. కాకతీయ కళాతోరణం తీసేసిన కాంగ్రెస్‌ను ఖతం చేయాలని కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై పనిచేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, మంత్రులు సోనియా, ప్రియాంక, రాహుల్‌గాంధీ కుర్చీలపై ఉన్న టవల్స్ తీసేందుకే అటెండర్లలా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకుల విషయానికి వస్తే.. ఒక మంత్రి అమిత్‌షా ఎప్పుడు చెప్పులు విప్పుతారా, ఆ చెప్పులు ఎప్పుడు మోయాలా అని ఎదురు చూస్తారని అన్నారు. తెలంగాణ పౌరుషాన్ని చాటే ఏకైక పార్టీ బీఆర్‌ఎస్ అని, అది కేసీఆర్ తీసుకొచ్చిన ఆత్మగౌరవమని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది 500 రోజులే

ఈ ప్రభుత్వానికి ఇంకా 500 రోజులు మాత్రమే అధికారం ఉందని అన్నారు. 500 రోజుల తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టి మళ్లీ రామరాజ్యం తీసుకొచ్చే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ప్రతి కార్యకర్త పోరాట పటిమతో కాంగ్రెస్‌ను గద్దె దించే వరకు నిద్రపోవద్దని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎల్‌నినోతో కరువు రాలేదని, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువని కేటీఆర్ ఆరోపించారు. గోదావరి నుంచి వచ్చిన నీటిని ఎత్తిపోతల ద్వారా తెలంగాణ పంటలకు అందించాల్సింది పోయి ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ నీళ్లన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరలించుకుని ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారని అన్నారు. రేవంత్‌రెడ్డి ఆయన పదవీకాలం అంతా బూతులకే పరిమితమవుతుందని ధ్వజమెత్తారు.

‘నా గడ్డం అభివృద్ధి పనులకు, ఆయన ఇచ్చిన హామీలకు అడ్డమేమిటో చెప్పాలి’ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలా తాను ఉండాలని గడ్డం పెంచుకున్నట్లు పదేపదే చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రిలా ఎవరైనా ఉండాలనుకుంటున్నారా అని ప్రజలను ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నానని చెబుతున్న రేవంత్‌రెడ్డి.. అసలు ఫ్యూచర్ సిటీ వరంగల్‌లోనే ఉందని, రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీ వరంగల్ అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తదితరులు ప్రసంగించారు. పలువురు కార్పొరేటర్లు, విద్యావేత్త తిరుపతిరెడ్డి తదితరులు పార్టీలో చేరగా.. వారికి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Tags

Next Story