కొండగట్టు అగ్నిప్రమాద ఘటనపై కెటిఆర్ ఆవేదన..

కొండగట్టు అగ్నిప్రమాద ఘటనపై కెటిఆర్ ఆవేదన..
X

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భారీ ఆస్తి నష్టం..

ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల పరిహారం ఇవ్వాలి

మాజీ ఎంఎల్‌ఎ సుంకె రవిశంకర్‌తో మాట్లాడిన కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అభయాంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఆయన చొప్పదండి మాజీ ఎంఎల్‌ఎ సుంకే రవిశంకర్‌కు ఫోన్ చేసి మాట్లాడి క్షేత్రస్థాయిలో జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కోసం అప్పులు చేసి, ఎంతో కష్టపడి దుకాణాలు పెట్టుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ ప్రమాదంతో ఒక్కసారిగా రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. షాపుల్లో ఉన్న సరుకు, బొమ్మలు, ఇతర సామాగ్రి సర్వం అగ్నికి ఆహుతి అయ్యాయని, దాదాపు 30 కుటుంబాల భవిష్యత్తు నాశనమైందని విచారం వ్యక్తం చేశారు.

సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇంత భారీగా ఆస్తి నష్టం పెరగడానికి సకాలంలో ఫైర్ ఇంజన్లు రాకపోవడమే ప్రధాన కారణమని మండిపడ్డారు. జగిత్యాల ఫైర్ ఇంజన్ రిపేర్‌లో ఉండటం, వచ్చిన ఒక ఇంజన్ పని చేయకపోవడం, గంట తర్వాత కోరుట్ల, కరీంనగర్ నుంచి వాహనాలు రావడం ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సర్వం కోల్పోయిన ఆ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

జరిగిన ఆస్తి నష్టం, పూర్తిగా దెబ్బతిన్న వ్యాపారాన్ని, దుకాణాలు ఏమాత్రం పనికిరాని స్థితికి చేరడాన్ని దృష్టిలో ఉంచుకొని, మానవతా దృక్పథంతో ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదం విషయం తెలియగానే అక్కడికి చేరుకుని, సహాయక చర్యల్లో పాల్గొని, బాధితులకు తక్షణ సాయంగా రూ. 5000 అందజేసిన మాజీ ఎంఎల్‌ఎ సుంకే రవిశంకర్‌ను కెటిఆర్ అభినందించారు. స్థానికులకు, నష్టపోయిన కుటుంబాలకు బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోకుంటే, పార్టీ తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కెటిఆర్ హెచ్చరించారు.

Tags

Next Story