డొల్ల కేసు అని తేలింది

మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీ లేదని, తమ ప్రభుత్వం ఏ తప్పూ చేయలేదని ఈరోజు(ఆదివారం)తో తేలిపోయిందని బి ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చెప్పారు. ఇది కేవలం ప్రభుత్వ అధినేతల పైశాచికానందం, ఇందులో ఏమీ లేదని సిట్ అధికారులు కూడా అర్థమైపోయిందని, దీంతో ఇక్కడితో ఈ కేసుకు ఫుల్‌స్టాప్ పడుతుందని భావిస్తున్నామని అన్నారు. సిట్ విచారణ అనంతరం కెసిఆర్ ఎర్రవెళ్లికి వెళ్లిన తర్వాత నందినగర్ నివాసంలో కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి నిధులు తేలేమని బిజెపి, కాంగ్రెస్ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకుందుకే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే కెసిఆర్‌ను విచారణను పిలవడంతో ఆం తర్యం అదేనని ఆయన ఆరోపించారు. కెసిఆర్ మీద బురదజల్లడం అంటే సూర్యుడిపైన ఉమ్మేసినట్లే అవుతుందని ఇప్పటికైనా అర్థమై ఉంటుందని అన్నారు. సిట్ విచారణకు కెసిఆర్ హాజరు కావాల్సిన అవసరం లేకపోయినప్పటికీ చట్టాన్ని గౌరవించే బాధ్యతాయుతమైన పౌరుడిగా సిట్ అధికారులకు కెసిఆర్ పూర్తిగా సహకరించారని తెలిపారు. ఆయనను అడిగిన ప్రశ్నలకు కుండబద్దలు కొట్టినట్లుగా సమాధానం చెప్పి సిట్ అధికారుల కళ్లు తెరిపించారని చెప్పారు. సిట్ ఎవరి నేతృత్వంలో నడుస్తుందని ప్రశ్నించారు. సిట్ నేతృత్వం వహించేది మహేష్‌కుమార్ గౌడ్..? అధికారులా..? అంటూ ఎద్దేవా చేశారు.
చట్టం ముందు అందరూ సమానమే అని, విచారణ చేస్తే ఆందోళన చేస్తారా..? అని పిసిసి ఛీఫ్ ప్రశ్నిస్తున్నారని, మరి ఇడి కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను విచారిస్తే మీరెందుకు వెళ్లి రాజ్‌భవన్ ముందు ఆందోళనలు చేశారని నిలదీశారు. తెలంగాణ ప్రజలచేత రెండు సార్లు ఎన్నుకోబడిన పాపులర్ సిఎం, రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కెసిఆర్‌ను వేధిస్తే కాళోజీ నారాయణరావు చెప్పినట్లు ఉక్కుపాతరేస్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పట్టించుకునే నాయకుడే లేరని విమర్శించారు. సిఎం రేవంత్‌రెడ్డి ఛార్టెడ్ ప్లైట్లలో చెక్కర్లు కొడుతూ గాలి తిరుగుడు తిరుగుతున్నారని, ఆ డబ్బులు ఎవడి అబ్బ సొమ్మని ఆయన ధ్వజమెత్తారు. ఒకవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి పట్టపగలు కోఠిలో కాల్పులు జరిగాయి, మరోవైపు గంజాయి స్మగ్లర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్‌పై కారు ఎక్కించి చంపేశారని, రెండో కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క సారక్క జాతర అధ్వాన్న ఏర్పాట్లతో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, వాటిని పట్టించుకునే నాథుడు లేడు, మంత్రులకు సోయి లేదని తీవ్ర విమర్శలు చేశారు.
ఈ కేసులో లీకులే తప్ప ఆధారాల్లేవు
ఫోన్ ట్యాపింగ్ కేసులో లీకులే తప్ప ఆధారాల్లేవు అని కెటిఆర్ తేల్చిచెప్పారు. ఈ కేసులో డొల్లతనం బయటపడిందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ అటెన్షన్‌ను దెబ్బ తీయడానికే విచారణ పేరుతో డ్రామా చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ప్రభుత్వం బాకీపడ్డ మొత్తానికి సంబంధించిన బాకీకార్డులు పంచుతూ వివరిస్తామని తెలిపారు.ఫోన్ ట్యాపింగ్‌లు, కుంభకోణాలు అంటూ రెండేళ్లుగా 1,2,3గా సిట్‌లు వేస్తూ హిట్ 1, హిట్ 2, హిట్ 3 సినిమా లాగా టైం పాస్, బక్వాస్ తప్ప ఇందులో ఏమీ లేదని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే లీకులు విశ్వసించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మున్సిపల్ ఎన్నికలపై కెసిఆర్ ఆరా..తిరిగి ఎర్రవెళ్లికి
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముగిసిన అనంతరం కెటిఆర్, హరీష్ రావు, పార్టీ ముఖ్యనేతలతో కెసిఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై చర్చించి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. గ్రౌండ్ లెవల్లో పార్టీ బలంగా ఉందని, బరిలో రెబల్స్ లేకుండా చూసుకోవాలని సూచించారు. పార్టీ నేతలతో సమావేశం ముగిసిన అనంతరం నందినగర్ నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కెసిఆర్ బయలుదేరి వెళ్లారు.
-
Home
-
Menu
