తెలంగాణ సాధకుడు కెసిఆర్ పై ఈ దుర్మార్గపు వైఖరి ఏంది?: కెటిఆర్

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోప్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు మరోసారి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఫైరయ్యారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ? అంటూ మండిపడ్డారు. సిట్ నోటీసులపై ఆయన స్పందిస్తూ.. ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
"స్వయంగా కెసిఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఇది అహంకారం కాకపోతే మరేమిటి?. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా అతిక్రమిస్తున్నారు పోలీసులు. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీచేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా?. చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు వాటిమీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ అక్రమ కేసులన్నీ చేధిస్తాం. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతాం. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్దిచెబుతారు" అని కెటిఆర్ అన్నారు.
కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవ్వాలంటూ రెండు రోజుల క్రితం సిట్ అధికారులు కెసిఆర్ కు నోటీసులు జారీ చేశారు. అయితే, ప్రస్తుతం ఉన్న పార్టీ కార్యక్రమాల వల్ల తాను హాజరుకాలేనని.. జూబ్లీహిల్స్ లోని నందినగర్ లో కాకుండా తాను ప్రస్తుతం నివాసం ఉంటున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తనను విచారించాలని కోరుతూ కెసిఆర్ సిట్ కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన సిట్.. ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నాం మూడు గంటలకు నందినగర్ ఆయన నివాసంలోనే విచారిస్తామని తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి మరోసారి నోటీసులు అందించేందుకు నందినగర్‌లో ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గోడకు వాటిని అంటించారు.
-
Home
-
Menu
