అవును.. నాకు అహంకారమే: కెటిఆర్

అవును.. నాకు అహంకారమే: కెటిఆర్
X

కొందరు కేటీఆర్‌కు అహంకారం ఉందంటారు. నిజమే, ఐదు పర్యాయాలు సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎన్నికల్లో ఒక్క రూపాయి, చుక్కా మందు పంచకుండా గెలిచాననే అహంకారం తనకున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం పునరుద్ఘాటించారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో శనివారం బీఆర్‌ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు. 2009 నుంచి సిరిసిల్ల నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా బాధ్యతలు నిర్వహించేందుకు అసెంబ్లీ మెట్లు ఎక్కేందుకు సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలే కారణమని వారందరికి పాదాభివందనాలన్నారు. తనకు జన్మనిచ్చింది తల్లి శోభమ్మైతే, రాజకీయగా జన్మనిచ్చింది సిరిసిల్ల ప్రజలని, తన బొందిలో ప్రాణం ఉన్నంతవరకు సిరిసిల్ల ప్రాంత అభివృద్ధి కోసం ఏదోరకంగా పనిచేస్తూనే ఉంటానని కేటీఆర్ ప్రకటించారు. వేలమంది బలిదానాలు చేసి సాధించుకున్న తెలంగాణ పుష్కరకాలం తర్వాత ముష్కరుల పాలైందన్నారు.

అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఎన్టీఆర్, ఇందిరాగాంధీ లాంటి మహా నాయకులే ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని, కాకపోతే పోరాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణలో జరుగుతున్న దారుణాలు చూసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గుండె తల్లడిల్లుతోందన్నారు. సీఎం పదవి కోసం కేసీఆర్ ఆరాట పడటంలేదని అన్నిరంగాల ప్రజలకు ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాలు చూసి కేసీఆర్ తల్లడిల్లుతున్నారన్నారు. సిరిసిల్లలో ఒకప్పుడు నక్సల్ సమస్యలు, నీటి సమస్యలు, శాంతిభద్రతల సమస్యలు, సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు, ఉపాధి సమస్యలు ఇలా అనేక సమస్యలుండగా సాధించుకున్న తెలంగాణలో వాటిని పరిష్కరించుకుంటూ ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. నేతన్నల బతుకులు బాగుపడాలని, సిరిసిల్లలో నేతన్నల బతుకులు బాగుచేయాలని బతుకమ్మ చీరెలు తయారీ ఆర్డర్లు ఇస్తే వాటిలో కుంభకోణాలు, దోపిడీ అంటూ వాటిని రద్దు చేశారన్నారు. సిరిసిల్లలో టెక్స్‌టైల్ ఇండస్ట్రీ లేదని కేవలం విద్యుత్ ఆధారిత కుటీర పరిశ్రమ అని తెలుసుకోవాలన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని నేతన్నలు, రైతన్నలు అన్నిరంగాల ప్రజలు కోరుతున్నారన్నారు.

కేసీఆర్ హయాంలో ప్రభుత్వానికి రూ.వేల కోట్ల నష్టం వచ్చినా రైతుల నుంచి ధాన్యం కళ్లకద్దుకొని కొనుగోలు చేశారని, రేవంత్ పాలనలో రైతుబంధు మాట దేవుడెరుగు కాళ్లుమొక్కినా రైతుల నుంచి కనీసం ధాన్యం కొనడం లేదన్నారు. కల్లాల వద్దే రైతులు వడదెబ్బతో ప్రాణాలు వదులుతున్నారన్నారు. రైతులకు గన్నీ బ్యాగుల కరువు ఎందుకైందని పరిశీస్తే గన్నీ బ్యాగుల మూటలు రాహుల్‌గాంధీకి చేరుతున్నాయన్నారు. రైతులకు మళ్లీ వెనుకటి రోజుల వచ్చాయని యూరియా దొరకడం లేదన్నారు. చెప్పులు వరసల్లో పెట్టి నిలబడాల్సి వస్తోందన్నారు. గతంలో సిరిసిల్ల నియోజకవర్గం వెంకటాపూర్‌లో యూరియా కోసం వచ్చిన రైతు మునిగె ఎల్లయ్య వడదెబ్బతో మృతిచెందిన సంఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు. సన్నాసి సీఎం రేవంత్ వంద రోజుల్లో ఆరు హమీలు అమలుచేస్తానని 900 రోజులు గడిచినా అమలుచేయడం లేదన్నారు. పరిపాలన చేతకాని రేవంత్ నాపై 45 కేసులు పెట్టాడన్నారు. కేసులకు వెరవనన్నారు. వచ్చే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో కేసీఆర్‌నే అభ్యర్థిగా భావించి అందరినీ ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను తెచ్చే ఎన్నికలు కావాలన్నారు.

ఉపన్యాసాలతో ఓట్లు పడవని, ప్రతీ నాయకుడు తన పరిధిలోని బూత్‌లో మెజార్టి ఓట్లు సాధించాలన్నారు. ఈ సంవత్సరంలో బీఆర్‌ఎస్ డిజిటల్ సభ్యత్వాలు సేకరించి, కమిటీలు వేసి, కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించి సుశిక్షితులైన సైనికుల్లా తయారుచేస్తామన్నారు. రేవంత్ పాలనా తీరును సినిమా టీజర్, ట్రైలర్‌లా చూసి ప్రజలు హిట్టా ఫట్టా అనేది తేల్చేశారన్నారు. కాంగ్రెస్ సినిమా డిజాస్టర్ అన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పట్ల బీఆర్‌ఎస్ బూత్ నాయకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతీ కార్యకర్త కథా నాయకుడు కావాలన్నారు. 2028 ఎన్నికల్లో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారని, ఇప్పుడు అధికారం పోయినా ప్రజలకు కేసీఆర్‌పై మమకారం పోలేదన్నారు. ప్రజలు కేసీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఉన్నంత బలం, బలగం ఇతర పార్టీలకు లేవన్నారు. 2028 తర్వాత అధికారంలోకి రాగానే కార్యకర్తల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తాటిపర్తి జీవన్‌రెడ్డి, కొండూరి రవీందర్‌రావు, తుల ఉమ, తోట ఆగయ్య, గూడూరి ప్రవీణ్, జిందం కళా చక్రపాణి, న్యాలకొండ అరుణ, జిందం చక్రపాణి, చీటి నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.


Tags

Next Story