అవినీతి అనకొండ రేవంత్‌రెడ్డి: కెటిఆర్

అవినీతి అనకొండ రేవంత్‌రెడ్డి: కెటిఆర్
X

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవినీతి అనకొండ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దుయ్యబట్టారు. వరంగల్ జిల్లా, గీసుగొండ శివారులోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును బుధవారం పార్టీ నేతలతో కలిసి ఆయన సందర్శించారు. కిటేక్స్ కంపెనీకి చెందిన అత్యాధునిక స్పిన్నింగ్ ఇండస్ట్రీని, యంగ్ వన్ కంపెనీకి చెందిన గార్మెంటరీ ఇండస్ట్రీని ఆయన పరిశీలించారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి ఉత్పత్తికి సంబంధించిన వివరాలను, పార్కులో సౌకర్యాలు, సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించి వేల కోట్ల పెట్టుబడులను, కొత్త కంపెనీలను తెచ్చిందన్నారు. అందులో భాగంగానే వరంగల్‌లో ఏర్పాటు చేసిన దేశంలోని అతి పెద్దదైన మెగా టెక్స్‌టైల్ పార్కు అని గుర్తు చేశారు. కెసిఆర్ దార్శనికతకు నిలువుటద్దం వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కు అని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పారిశ్రామిక విధానానికి తూట్లు పొడుస్తూ విలువైన భూములను ప్రయివేట్ వ్యక్తులకు అప్పనంగా ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫర్మేషన్ పాలసీ (హిల్టప్) ఎవరి ప్రయోజనం కోసం తెచ్చారని ప్రశ్నించారు. పారిశ్రామికవాడల్లోని రూ.5 లక్షల కోట్ల విలువైన 9,300 ఎకరాల భూమిని ముఖ్యమంత్రి, ఆయన సోదరుల కనుసన్నల్లో కొల్లగొట్టే ప్రయత్నమే హిల్టప్ పాలసీ ఉద్దేశమని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి దోచుకున్న వేల కోట్ల రూపాయలను రాహుల్ గాంధీకి పంపే ఏర్పాట్లలో ముఖ్యమంత్రి ఉన్నారని ధ్వజమెత్తారు. ఇకా బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని గొప్పలు చెప్పి, పంచాయతీ ఎన్నికల్లో 17 శాతానికే పరిమితం చేసినందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్, రేవంత్ రెండు చెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓఆర్‌ఆర్ పనులతో పాటు డ్రైనేజీ, ఇతర సౌకర్యాలు కల్పించి పార్కును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన వెంట జనగామ ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎలు చల్లా ధర్మారెడ్డి, వినయ్ భాస్కర్, నరేందర్, రాజయ్య, వెంకట రమణారెడ్డి, సుదర్శన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

* నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

గీసుకొండ మండలం, ఊకల్ హవేలి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిరామారావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Tags

Next Story