ఖానాపూర్‌లో చిరుతల సంచారం

ఖానాపూర్ పరిసరాల్లోని నాలుగు కిలోమీటర్ల పరిధిలో 15 నిమిషాల వ్యవధిలో రెండు చిరుతల సంచారం శనివారం రాత్రి కలకలం రేపింది. ఖానాపూర్‌ను ఆనుకునివున్న కొమురం భీమ్ చౌరస్తా నుంచి తర్లపాడు మధ్య అటవీ ప్రాంతంలో రాత్రి 8ః30 సమయంలో ఓ చిరుత రోడ్డు దాటడానికి ప్రయత్నించగా నిర్మల్ వైపు నుంచి కడెంకు వెళ్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. 15 నిమిషాల వ్యవధిలోనే ఖానాపూర్ నుంచి దిలావర్‌పూర్ మీదుగా సత్తెనపల్లి వెళ్లే రహదారి ఆనుకొనివున్న పంట పొలంలో మరో చిరుత కనిపించి కలకలం సృష్టించింది. దిలావర్‌పూర్‌కు చెందిన మంగతార అనే మహిళా రైతు.. తన పంట చేలో తరుచుగా వ్యవసాయ పనిముట్లు చోరీకి గురవుతుండటంతో రక్షణ కొరకు 8 సీసీ కెమెరాలు అమర్చారు.
శనివారం రాత్రి 9 గంటలలోపు మంగతార అనే రైతు పంట చేనులో చిరుత సంచరించడంతో పక్కనే ఉన్న రైతులు భయాందోళనకు గురయ్యారు. చిరుత కనిపించడంతో రాత్రిళ్లు పంట చేనుకు కాపలాలకు వెళ్లే రైతులు జంకుతున్నారు. కొమురం భీమ్ చౌరస్తా సమీపంలో చిరుత కనిపించడంతో అక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న స్టాటస్టిక్స్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. సిబ్బంది అడవిలో రోడ్డుపై టెంట్లు వేసుకొని ఎన్నికల తనిఖీ విధులు నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి చిరుతలు సంచరిస్తున్నాయన్న సమాచారంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి సంచరిస్తున్న చిరుత పులుల ఆచూకీ కనుగొని.. వాటిని సురక్షిత ప్రాంతానికి తరలించి ఎన్నికల సిబ్బందికి, పంట పొలాలకు కాపలా వెళ్లే రైతులకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు.
-
Home
-
Menu
