హుస్నాబాద్ బస్సు స్టేషన్ కు లింక్ కాలువ ఏర్పాటు చేయండి: పొన్నం

సిద్దిపేట: ఇటీవల భారీ వర్షాలు కురవడంతో హుస్నాబాద్ బస్సు స్టేషన్ నీట మునిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నీట మునగకుండా లింక్ కాలువ ఏర్పాటు చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైన హుస్నాబాద్ బస్సు స్టేషన్ ప్రాంతాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించడం జరిగింది. భవిష్యత్ లో బస్సు స్టేషన్ లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం హుస్నాబాద్ మార్కెట్ కమిటీ సందర్శించారు. ధాన్యం కొనుగోలు వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం లోడ్ అయిన 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేశామని, వారి ఖాతాలో డబ్బులు కూడా జమయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్లమ్మ చెరువులో సహచర మంత్రి వాకిటి శ్రీహరి, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్లతో కలిసి ఉచిత చేప పిల్లల పంపిణీ లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఎల్లమ్మ చెరువులో 5.17 లక్షల రూపాయలతో 3 లక్షల చేప పిల్లలు విడుదల చేయడం జరిగింది.

Next Story