ఆగి ఉన్న స్కూల్ బస్సును ఢీకొన్న లారీ.. నలుగురు చిన్నారులు మృతి

మన తెలంగాణ : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కన్నౌజ్ జిల్లాలోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆగి ఉన్న స్కూల్ బస్సును వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరో 32 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 24 మంది విద్యార్థులు, ఎనిమిది మంది పాఠశాల సిబ్బంది ఉన్నారు.
మంగళవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో థాథియా ప్రాంతం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కౌశాంబి ప్రాంతానికి చెందిన ఓరియంటల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఆగ్రాలోని తాజ్‌మహల్ సందర్శనకు వెళ్లి తిరిగి వస్తున్నారు. మొత్తం 50 మందితో ప్రయాణిస్తున్న బస్సును పిల్లలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఎక్స్‌ప్రెస్‌వే పక్కన నిలిపారు.
అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ లారీ వెనుక నుంచి బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదాన్ని గమనించిన పోలీసులు, ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ సిబ్బంది, అటుగా వెళ్తున్న వాహనదారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
దెబ్బతిన్న బస్సులో చిక్కుకున్న విద్యార్థులు, సిబ్బందిని బయటకు తీసి అంబులెన్సుల్లో సమీపంలోని వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు నలుగురు చిన్నారులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మిగిలిన క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags
-
Home
-
Menu
