ప్రేమ పెళ్లి.... ప్రియుడు ఇంటిని కూల్చివేసిన అమ్మాయి బంధువులు
మన తెలంగాణ గద్వాల ప్రతినిధి: దళిత యువకుడుని ప్రేమించి పెళ్లి చేసుకుందని అమ్మాయి తల్లిదండ్రులు పెళ్ళికొడుకు ఇల్లును అమ్మాయి బంధువులు ధ్వంసం చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న కోపంతో ఓ యువకుడి ఇంటిని అమ్మాయి కుటుంబ సభ్యులు ట్రాక్టర్, జెసిబి, గడపరల సహాయంతో కూల్చివేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం రేపల్లె గ్రామానికి చెందిన రంగముని (ఎస్సీ వర్గం), మహేశ్వరి (బోయ-బీసీ వర్గం) గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ మేజర్లు కావడంతో బుధవారం హైదరాబాద్‌లో ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం తమకు తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని భావించి, రక్షణ కల్పించాలంటూ హైదరాబాద్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. రంగముని, మహేశ్వరి విజ్ఞప్తి మేరకు పోలీసులు ఇరువైపుల తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇద్దరూ మేజర్లు కావడంతో వారి జీవితంలో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అమ్మాయి తల్లిదండ్రులు, గురువారం దళిత యువకుడు తమ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడంటూ ఆక్రోశంతో రేపల్లెలోని రంగముని ఇంటిపై జేసీబీ, ట్రాక్టర్లతో దాడి చేసి ఇంటిని పూర్తిగా కూల్చివేశారు. ఈ దాడితో రేపల్లె గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాసులు తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో ముందస్తు జాగ్రత్తగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.
-
Home
-
Menu


