సింగరేణి కాంట్రాక్టులు బిఆర్‌ఎస్ హయాం నాటివే..!: మహేష్‌కుమార్ గౌడ్

file name: fnzb1
గత పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ చేసిన అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే, ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బుదవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. సింగరేణి కాలరీస్‌లో కాంట్రాక్ట్ విషయంలో సృజన్‌రెడ్డికి లబ్ధి చేకూరుస్తున్నారంటూ కేటీఆర్, హరీష్‌రావు చేస్తున్న ఆరోపణలు ‘పసలేనివి‘ కొట్టిపారేశారు. సృజన్‌రెడ్డికి దక్కిన కాంట్రాక్టులన్నీ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చినవని, కాంగ్రెస్ ఇచ్చినవి కావని స్పష్టం చేశారు. సృజన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బంధువు కావచ్చు, కానీ నిబంధనల ప్రకారమే ఆయనకు గతంలో టెండర్లు దక్కాయని తెలిపారు. కేవలం బంధువు అయినంత మాత్రాన కాంట్రాక్టులు చేయకూడదనే నిబంధన ఎక్కడా లేదని అన్నారు. ‘మీ దగ్గర నిజాలుంటే చర్చకు రండి, మేము సిద్ధంగా ఉన్నాం.
అనవసరంగా కాంగ్రెస్ మీద బురదజల్లి పారిపోవాలని చూడకండి‘ అని సవాల్ విసిరారు. ఇక ఫోన్ ట్యాపింగ్ ఒక భయంకర నేరం. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. కేవలం రాజకీయ నాయకులవే కాకుండా, బడా వ్యాపారవేత్తలు, సినీనటుల వ్యక్తిగత విషయాల్లోకి కూడా దూర్చి వారిని బెదిరించారని ఆరోపించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను సైతం నమ్మకుండా వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని పేర్కొన్నారు. ఈ నేరంలో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టేది లేదని, ప్రభుత్వం చట్టపరంగా ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. తెలంగాణను ఆర్థికంగా చిన్నాభిన్నం చేసి, రాష్ట్రాన్ని దోపిడీకి గురిచేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని శాఖల్లో పారదర్శకత కోసం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చామని, గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఎన్నికల లబ్ధి కోసం అడ్డగోలుగా ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.
నిజామాబాద్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఖాయం..
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు ధనపాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డిలు కేవలం దేవుడి పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ‘దేవుడి పేరు, శ్రీరాముని నామం స్మరించకుండా దమ్ముంటే ఎన్నికల బరిలోకి రావాలి. కేవలం అభివృద్ధి ప్రాతిపదికన ఓట్లు అడిగితే వీరికి పదివేల ఓట్లు కూడా రావు‘ అని సవాల్ విసిరారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన జిల్లాకు స్మార్ట్ సిటీని తెచ్చుకున్నారు. నిజామాబాద్ కంటే తక్కువ జనాభా, ఆలస్యంగా మున్సిపాలిటీ అయిన కరీంనగర్ స్మార్ట్‌సిటీగా రూపుదిద్దుకుంటుంటే..
అరవింద్ ఎందుకు స్మార్ట్ సిటీని తీసుకురలేకపోతున్నారని ప్రశ్నించారు. రెండోసారి ఎంపీగా గెలిచిన అరవింద్ ఈ జిల్లాకు ఏం తెచ్చారు?‘ అని సూటిగా ప్రశ్నించారు. నిజామాబాద్ అభివృద్ధిని గాలికొదిలేసి కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ అరవింద్ ప్రస్తుతం అనుభవిస్తున్న స్థాయి, హోదా అంతా కాంగ్రెస్ పెట్టిన బిక్షేనని, విమర్శలు చేసే ముందు తన గతాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. తన పుట్టుపూర్వోత్తరాలు మర్చిపోయి మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. డి. శ్రీనివాస్ కాంగ్రెస్‌లో ఉండబట్టే మీ కుటుంబానికి ఈ ఆర్థిక స్థితిగతులు, గౌరవం దక్కాయి. మీ తండ్రి కాంగ్రెస్‌లో లేకపోతే ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉండేవారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామక్రిష్ణ, తాహిర్ బిన్ హందాని,గడుగు గంగాధర్, శేఖర్ గౌడ్,రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
