పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైంది:మహేష్ కుమార్ గౌడ్

గత పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం విధ్వంసానికి గురైందని, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం వికాసం వైపు పయనిస్తోందని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించిందని, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా టాప్5లో నిలిచిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్దంగా ఉన్నాయని తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటాం. నిత్యం ప్రజల్లో ఉండి పని చేసే వారికి బి ఫామ్‌లు ఇస్తాం. పాత, కొత్త నేతలను సమన్వయం చేసుకుంటూ పక్కా ప్రణాళికతో ముందుకువెళ్తాం అని ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ వల్ల స్వల్ప నష్టం జరిగినా, మున్సిపల్ ఎన్నికల్లో అటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతామని పేర్కొన్నారు.
బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, ఇప్పుడు ఫామ్ హౌస్‌కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిజామాబాద్ కేంద్రంగా బియ్యం స్మగ్లింగ్ మాఫియా రాజ్యమేలిందని ఆరోపించారు. దేవుడి పేరును వాడుకునే హక్కు బిజెపికి ఎవరిచ్చారు? ఎన్నికలు రాగానే దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేయడం వారికి పరిపాటిగా మారింది. 12 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం దేశానికి ఏం చేసిందో చెప్పి ఓట్లు అదగాలని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుల దావోస్ పర్యటనతో రాష్ట్రానికి రూ. 1.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, గ్లోబల్ సమ్మిట్ ద్వారా మరో రూ. 5.70 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రావడం శుభపరిణామమని కొనియాడారు. జిల్లాలో 80 శాతం మందికి ఉచిత విద్యుత్ అందుతోంది. ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ ద్వారా పేదలకు అండగా నిలుస్తున్నాం. జిల్లాకు 30 ఏళ్ల ఇంజనీరింగ్ కాలేజీతో పాటు అగ్రికల్చర్ కాలేజీని సాధించుకున్నాం.
రూ. 600 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కులం, మతం పక్కనబెట్టే పేదవారి జీవిత స్థితిగతులు మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్షమని, ప్రజా పాలనలో చేపట్టిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కడతారని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామక్రిష్ణ, తాహెర్‌బిన్‌హందాన్, నూడ చైర్మన్ కేశ వేణు, నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
