కెసిఆర్ దీక్ష ఓ నాటకం: మహేశ్‌కుమార్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర సాధన పేరుతో నాడు కెసిఆర్ చేసిన దీక్ష ఒక నాటకమని పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ జిల్లా నూతన అధ్యక్షుడుగా ఎంపికైన నగేశ్‌రెడ్డి, నగర అధ్యక్షుడుగా ఎంపికైన బొబ్బిలి రామకృష్ణ సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నగరంలోని ఓ కళ్యాణ మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలోనే పిసిసి చీఫ్ మాట్లాడుతూ.. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పార్టీ జిల్లా, నగర అధ్యక్షులకు అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయి వరకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల సమస్యలు తీర్చడంలో పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. రాబోయే అన్ని ఎన్నికల్లో కలిసికట్టుగా ఉండి విజయమే లక్ష్యంగా అడుగు వేయాలని సూచించారు. గత 10 సంవత్సరాల కష్టకాలంలో జిల్లా పార్టీకి అండగా ఉంటూ అధికారమే లక్ష్యంగా పెట్టుకొని సేవలందించిన మనాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణును అభినందించారు. బిఆర్‌ఎస్ ఉనికిని చాటుకునేందుకు కోట్లాది రూపాయల ఖర్చుతో దీక్షా దివస్ పేరుతో ఆ నాటకాన్ని రక్తి కట్టించేందుకు యత్నిస్తోందని దుయ్యబట్టారు.
ఆ రోజున కెసిఆర్ చేసిన దీక్ష వల్ల తెలంగాణ రాలేదని, సోనియాగాంధీ వల్ల రాష్ట్రం వచ్చిందని అన్నారు. ఆనాడు సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే కెసిఆర్ ముఖ్యమంత్రిగా, కెటిఆర్, హరీశ్‌రావు, కవితకు పదవులు వచ్చేవా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు నూకలు చెల్లాయని జోస్యం చెప్పారు. దీక్షా దివస్ చేసిన మాజీ ఎమ్మెల్యే జిల్లాలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. బిసి రిజర్వేషన్లపై ఎంతో శ్రమించి తీసుకువస్తే బిజెపి నేతలు అడ్డుకున్నారని మండిపడ్డారు. అందువల్లనే వారికి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో డిపాజిట్ కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీకి రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు ఉండదని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ పాటికే పలు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి ప్రజలు ఆకర్షితులై పలువురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పేర్కొన్న హామీలు, ఆరు గ్యారంటీలు ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. జిల్లాకు 35 ఏళ్ల కల అయిన ఇంజనీరింగ్ కళాశాల తీసుకువచ్చామని తెలిపారు. తన స్వగ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం 11 ఎకరాలు దానం చేసినట్లు తెలిపారు.
-
Home
-
Menu
