డిసిఎంలో మంటలు..వ్యక్తి, 200 మేకలు మృతి

మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ సమీపంలో జాతీయ రహదారి 44పై గురువారం తెల్లవారుజామున డిసిఎం వాహనం రోడ్డు పక్కనున్న సూచిక బోర్డును ఢీకొనడంతో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనయ్యాడు. రాజస్థాన్ నుంచి బెంగళూరు వైపు మేకల లోడ్‌తో వెళ్తున్న డిసిఎం వాహనం అదుపుతప్పి భూత్పూర్ గ్రామం వద్ద రహదారి పక్కనున్న సూచిక బోర్డును ఢీకొట్టింది. దీంతో వాహనం డీజిల్ ట్యాంక్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లో వ్యాన్ మొత్తం వ్యాపించడంతో డీసీఎం పూర్తిగా దగ్ధమైంది. డిసిఎంలో మేకల మధ్య నిద్రిస్తున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు.
వాహనంలో ఉన్న సుమారు 200 వరకు మేకలు కూడా మంటల్లో చనిపోయాయి. క్యాబీన్‌లో ఉన్న డ్రైవర్ సహా ఐదుగురికి గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రికి, పరిస్థితి విషమంగా ఉన్న డ్రైవర్‌ను హైదరాబాద్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి, డిఎస్పీ వెంకటేశ్వర్లు సహాయక చర్యలను పర్యవేక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
Home
-
Menu
