పోలీసుల వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

మల్దకల్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి శేషన్న(28) గురువారం తన వ్యవసాయ పొలంలోని చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. గమనించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని గద్వాల సీఐ టి. శ్రీను పేర్కొన్నారు. కాగా పోలీసుల వేధింపులు తాళలేక కుమ్మరి శేషన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫిబ్రవరి 25న గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన కుమ్మరి రాణి పై కుమ్మరి మల్లేష్ దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు మల్లేష్ పరారీలో ఉన్నాడు. పరారిలో ఉన్న ప్రధాన నిందితుడు మల్లేష్ మలక్దల్‌కు చెందిన కుమ్మరి శేషన్న ఇద్దరు దగ్గర బంధువులు కావడంతో పాటు ప్రధాన నిందితుడు మల్లేష్‌కు శేషన్నతో పాటు మరో వ్యక్తి సహకరిస్తున్నారని ఆరోపణలు రావడంతో గట్టు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు.
తన భర్త శేషన్న జాడ తెలియక పోలీస్ స్టేషన్‌ల చుట్టు తిరిగిన పోలీసులు తెలుపలేదని మృతుని భార్య ఆరోపించింది. విచారణ అనంతరం వారిని పోలీసులు విడిచి పెట్టినట్లు తెలిపారు. దీంతో మనస్థాపం చెందిన శేషన్న గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. గద్వాల జిల్లా ఆసుపత్రి వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. పోలీసుల వేధింపులు తాళలేకనే కుమ్మరి శేషన్న ఆత్మహత్య చేసుకున్నాడని, పోలీసులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై గద్వాల సీఐ టి.శ్రీను వివరణ కోరగా ఆలూరులో కుమ్మరి రాణి పై జరిగి దాడిలో ప్రధాన నిందితుడు మల్లేష్ పరారిలో ఉండటంతో దగ్గరి బందువు అయిన కుమ్మరి శేషన్నను విచారించినట్లు తెలిసింది. పోలీసులు ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, మృతుడు శేషన్న ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామని గద్వాల సీఐ శ్రీను వెల్లడించారు.
-
Home
-
Menu
