మేడ్చల్‌లో భారీ అగ్నిప్రమాదం..రంగంలోకి ఫైర్, హైడ్రా సిబ్బంది!

Massive Fire in Medchal!
X

మేడ్చల్ : మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నయాన్ ఇన్ఫ్రా అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నాలుగో అంతస్తులో ఎదురెదురుగా ఉన్న రెండు ఫ్లాట్లలో గ్యాస్ సిలిండర్లతో పాటు ఏసీ కంప్రెషర్లు పేలినట్లు సమాచారం. దీంతో మంటలు భారీగా వ్యాపించాయి. ప్రమాదం సమయంలో అపార్ట్‌మెంట్‌లో ఉన్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. ముఖ్యంగా చిన్నపిల్లలను తీసుకుని కుటుంబ సభ్యులు హడావుడిగా కిందకు చేరుకున్నారు. పేలుళ్ల శబ్దాలతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ స్టేషన్ల నుంచి నాలుగు అగ్ని మాపక యంత్రాలు ఘటనాస్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. హైడ్రా సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మంటలు ఇతర ఫ్లాట్లకు వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల అసలు కారణాలు, ఆస్తి నష్టం, ప్రాణనష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Tags

Next Story