ప్రైవేటు ఆసుపత్రులలో మందుల మాయాజాలం... రూ.11 అయితే.. రూ.325 కు అమ్ముతున్నారు

Medical mafia in Private hospital
రూ.11 వస్తువు.. రూ.325 ఎంఆర్‌పి!
ఆస్పత్రి బిల్లులో అసలు మాయ.. సిరంజి నుంచి పేస్‌మేకర్ వరకు భారీ ధరల తేడా
రూ.11.05కు కొనుగోలు చేసిన ఐవీ సెట్.. ఎంఆర్‌పీ రూ.325.
రూ.6.75కు కొనుగోలు చేసిన 10 ఎంఎల్ సిరంజి.. ఎంఆర్‌పీ రూ.57.20.
రూ.22.50కు కొనుగోలు చేసిన ఐవీ క్యాన్యులా.. ఎంఆర్‌పీ రూ.424.
రూ.40కు కొనుగోలు చేసిన నెబ్యులైజర్ మాస్క్.. ఎంఆర్‌పీ రూ.715.
రూ.29.41కు కొనుగోలు చేసిన క్యాథెటర్.. ఎంఆర్‌పీ రూ.310.
హైదరాబాద్: ఇవి ఒక్కో వస్తువుకు సంబంధించిన ధరలే కాదు. ఆస్పత్రుల్లో తరచూ ఉపయోగించే పలు వైద్య పరికరాల్లో కొనుగోలు ధరకు, ఎంఆర్‌పీకి భారీ తేడా ఉన్నట్లు మహారాష్ట్ర ఎఫ్‌డీఏ సర్వేలో బయటపడింది. ఐవీ సెట్ విషయంలో కొనుగోలు ధర రూ.11.05. ఎంఆర్‌పీ రూ.325. అంటే దాదాపు 29 రెట్లు తేడా ఉంటుంది. 10 ఎంఎల్ సిరంజి విషయంలో రూ.6.75 నుంచి రూ.57.20, క్యాన్యులాలో దాదాపు 19 రెట్లు పెరిగింది. ఖరీదైన పరికరాల్లోనూ ఇదే తరహా వ్యత్యాసాలపై అధికారులు దృష్టి సారించారు. పేస్‌మేకర్లు, హార్ట్ వాల్వ్‌లు, కంటి లెన్స్‌ల వంటి పరికరాల తుది ఎంఆర్‌పి కొన్ని సందర్భాల్లో దిగుమతి ధర కంటే 10 నుంచి 30 రెట్లు ఎక్కువగా ఉండొచ్చని నివేదికలు పేర్కొన్నాయి. ఇక్కడ కొనుగోలు ధర, ఎంఆర్‌పి, రోగి బిల్లులో వసూలు చేసే ధర మూడు వేర్వేరు అంశాలు ఉన్నాయి. ఈ తేడా మొత్తం ఆస్పత్రి లాభమే అని చెప్పలేం. సరఫరా, నిల్వ, సిబ్బంది, ఇతర నిర్వహణ ఖర్చులు కూడా ఉంటాయి. అయితే రోగికి అసలు కొనుగోలు ధర తెలియకపోవడం ప్రధాన సమస్యగా మారుతోంది.
హైదరాబాద్‌లోనూ భారీ బిల్లు
ఇలాంటి ధరల వ్యత్యాసంపై హైదరాబాద్‌లో నమోదైన కేసు మరింత స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది. గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రి రూ.310కు కొనుగోలు చేసిన మెరోప్లాన్ 1 గ్రాము ఇంజెక్షన్‌ను రోగికి రూ.4,750.19 చొప్పున బిల్లు వేసింది. ఒక్క ఇంజెక్షన్‌పై తేడా రూ.4,440.19 గా ఉంది. రోగికి మొత్తం 79 ఇంజెక్షన్లు ఇచ్చారు. దీంతో రూ.3.50 లక్షలకు పైగా అదనపు మొత్తం వసూలైనట్లు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ గుర్తించింది. ఆస్పత్రి సమర్పించిన కొనుగోలు ఇన్వాయిస్‌లలో ఒక్కో ఇంజెక్షన్ ధర రూ.310గా ఉన్నట్లు కమిషన్ పేర్కొంది. 2025 డిసెంబర్ 23న ఇచ్చిన తీర్పులో కమిషన్ రూ.3,50,775 తిరిగి చెల్లించాలని ఆదేశించింది. 9 శాతం వడ్డీతో పాటు రూ.30 వేల పరిహారం, రూ.10 వేల ఖర్చులు చెల్లించాలని చెప్పింది. వినియోగదారుల సంక్షేమ నిధికి మరో రూ.లక్ష జమ చేయాలని ఆదేశించింది.
వైద్య నిర్లక్ష్యంపైనా కేసులు
హైదరాబాద్‌లో సమస్య ధరలకే పరిమితం కాలేదు. అత్యవసర చికిత్సలో జాప్యంపై కూడా వినియోగదారుల కమిషన్లు చర్యలు తీసుకున్నాయి. సిటిజన్స్ స్పెషాలిటీ ఆస్పత్రిలో తీవ్ర స్ట్రోక్‌తో వచ్చిన రోగికి కుటుంబ సభ్యుల సమ్మతి, కొవిడ్ ఆర్‌టీపీసీఆర్ ఫలితం కోసం అత్యవసర చికిత్స ఆలస్యమైందని కమిషన్ గుర్తించింది. చికిత్సకు కీలకమైన సమయం కోల్పోయిందని పేర్కొంది. ఆస్పత్రి, న్యూరాలజిస్ట్‌ను బాధ్యులుగా తేల్చి రూ.1 కోటి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అపోలో ఆస్పత్రికి సంబంధించిన మరో కేసులోనూ స్ట్రోక్ చికిత్సలో జాప్యం జరిగిందని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తేల్చింది. వైద్య రికార్డుల నిర్వహణపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మొత్తం రూ.42.87 లక్షలకు పైగా వివిధ రూపాల్లో పరిహారం, ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది.
Tags
-
Home
-
Menu
