కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర వ్యవసాయంపై తీవ్ర నిర్లక్ష్యం: మంత్రి తుమ్మల

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర వ్యవసాయంపై తీవ్ర నిర్లక్ష్యం: మంత్రి తుమ్మల
X

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్ రాష్ట్ర రైతులకు తీవ్ర నిరాశ కలిగించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కోట్లాది రైతుల ఆశలను ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని, రాష్ట్రం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, ఆయిల్ పామ్ దిగుమతులపై సుంకం పెంపు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం ఏర్పడే అవకాశం ఉందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించకుండా, దిగుమతులకు అనుకూలంగా కేంద్రం వ్యవహరించడం దురదృష్టకరమని మంత్రి అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు నిధుల కేటాయింపు లేకపోవడం, అలాగే పసుపును హై వాల్యూ క్రాప్‌గా గుర్తించకపోవడంతో రాష్ట్ర పసుపు రైతులకు తీవ్ర నిరాశను కలిగించిందని చెప్పారు.

లక్షలాది మంది పసుపు రైతులు ఎదురుచూస్తున్న డెడికేటెడ్ ఫండ్స్ గురించి బడ్జెట్‌లో స్పష్టమైన ప్రకటన లేకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నార్థకంగా మార్చిందని మంత్రి పేర్కొన్నారు. కొబ్బరి (కోకనట్) బోర్డు ఏర్పాటు విషయంలో కూడా ఎలాంటి ప్రకటన లేకపోవడం రాష్ట్ర రైతులకు మరో ఎదురుదెబ్బగా మారిందన్నారు. ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉందనే సంకేతాలు రైతులపై మరింత భారం మోపనున్నాయని, ఇప్పటికే పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను తగ్గించే చర్యలు బడ్జెట్‌లో పూర్తిగా లేవని మంత్రి తెలిపారు. రైతులకు అత్యంత కీలకమైన ఎంఎస్‌పి (కనీస మద్దతు ధర)కు చట్టబద్ధ హక్కు కల్పించడంలో కేంద్రం మరోసారి విఫలమైందని మంత్రి మండిపడ్డారు. వ్యవసాయ మార్కెటింగ్, ధరల స్థిరీకరణ, మార్కెట్ సంస్కరణలపై స్పష్టమైన దిశానిర్దేశం లేకపోవడం కేంద్ర బడ్జెట్ లోని ప్రధాన లోపమన్నారు. దేశీయ నూనెగింజల రైతులను రక్షించేలా తినుబండార నూనెలపై ఇంపోర్ట్ డ్యూటీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.

కేంద్ర పథకాల ఏకీకరణ పేరుతో రాష్ట్రానికి వచ్చే నిధుల్లో కోత విధించడం తీరని అన్యాయం అని మంత్రి స్పష్టం చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యం ఇప్పటికీ మాటలకే పరిమితమయిందని, దానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ బడ్జెట్‌లో ఎక్కడా కనిపించలేదన్నారు. వ్యవసాయ రంగంలో బడ్జెట్‌లో ఏఐ ఆధారిత కార్యక్రమాల ప్రస్థావన మాత్రమే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని, అయితే ధర భద్రత, మార్కెట్ భరోసా లేకుండా కేవలం ఏఐ సాంకేతికత రైతు సమస్యలు పరిష్కారం తీర్చదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌తో రాష్ట్రానికి, వ్యవసాయ రంగానికి ఎటువంటి ప్రత్యేక ప్రయోజనం లేకుండా పోయిందని మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Tags

Next Story