యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం

గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్‌లో మెగా జాబ్‌మేళాను నిర్వహించినట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తాము తలపెట్టిన జాబ్‌మేళా విజయవంతమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ పట్టణ ప్రాంతాల కన్నా, గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే చాలా ముఖ్యమని భావించామని, అందుకే హుజూర్‌నగర్ లాంటి గ్రామీణ ప్రాంతంలో ఈ జాబ్‌మెళాను నిర్వహించినట్లు చెప్పారు. శనివారం ఆయన సూర్యాపేట హుజూర్‌నగర్‌లోని పెర్ల్ ఇన్ఫినిటి ఇంటర్నేషనల్ సూల్‌లో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళా ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడా నిర్వహించలేదని, ఇది అతి పెద్ద జాబ్‌మేళా అని అన్నారు. దీనివల్ల హుజూర్‌నగర్, కోదాడ, నియోజకవర్గాలు ఉమ్మడి నల్గొండ జిల్లా నిరుద్యోగులకు ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలిపారు.
పలు కంపెనీలు అక్కడికక్కడే ఉద్యోగాలలో నియమిస్తూ అభ్యర్థులకు ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చాయని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అంశాలపై తెలంగాణ వచ్చిందని, దానిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అందులో భాగంగా ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలో 75 వేల ఉద్యోగాలు కల్పించామని, ప్రైవేట్ సెక్టార్లో సైతం పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చేందుకు ఈ జాబ్‌మేళాను చేపట్టినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు నిర్వహించే మెగా జాబ్‌మేళాలో సుమారు 275 కంపెనీలు పాల్గొని గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ సింగరేణి కాలరీస్ సహకారంతో ఈ జాబ్‌మేళాను ఏర్పాటు చేశామని, ఐటి సర్వీస్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్స్, ఫార్మా సిమెంట్ తదితర కంపెనీలన్నీ హుజూర్‌నగర్‌కు వచ్చి గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు.
శుక్రవారం నాటికి జాబ్‌మేళాకు 40 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని రెండు రోజుల పాటు జాబ్‌మేళా నిర్వహించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్ణయం మేరకు నిర్ణయించారని, అందుకు తగ్గట్టుగానే అభ్యర్థులకు భోజన, వసతి సౌకర్యాల కల్పించామని చెప్పారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ డైరెక్టర్ రాజేశ్వర్‌రెడ్డి, సింగరేణి కాలరీస్, సంస్థ హెచ్‌ఆర్ మేనేజర్ చంద్ర తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ, నకిరేకల్ బత్తుల లకా్ష్మరెడ్డి, శాసనసభ్యులు వేముల వీరేశం, ఎంఎల్‌సి శంకర్ నాయక్, సూర్యాపేట నల్గొండ, ఖమ్మం జిల్లాల ఎస్‌పిలు, అదనపు కలెక్టర్ సీతారామరావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం నిరుద్యోగులకు జాబ్ ఆఫర్ లెటర్‌లను మంత్రి అందజేశారు.
-
Home
-
Menu
