పట్టాలెక్కిన తిరుపతి - షిర్డీ ఎక్స్‌ప్రెస్

పట్టాలెక్కిన తిరుపతి - షిర్డీ ఎక్స్‌ప్రెస్
X

తిరుపతి సాయినగర్ షిర్డి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కింది. కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి వి. సోమన్న మంగళవారం వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు ఎం.రఘునాథ్ రెడి, డాక్టర్ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఇందులో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్‌లో జరిగిన కార్యక్రమానికి ఎపి మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణచక్రవర్తి, శాసన సభ్యులు ఆరణీ శ్రీనివాసులు, ఇతర ప్రజా ప్రతినిధులు , దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, ఇతర సీనియర్ రైల్వే అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి . సోమన్న మాట్లాడుతూ తిరుపతి - సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలలో నివసిస్తున్న భక్తులకు ఒక చారిత్రాత్మక రోజని అన్నారు. ప్రస్తుతం తిరుపతి, షిర్డీతో పాటు నెల్లూరు, గుంటూరు, సికింద్రాబాద్, బీదర్, మన్మాడ్, ఇతర ముఖ్యమైన స్టేషన్లోతో కలుపుకొని 31 స్టాప్‌లతో నేరుగా రైలు ద్వారా ప్రయాణించే అవకాశం ఉందన్నారు.

ఈ రైలు తీర్థయాత్రలు, పర్యాటకానికి , అనుసంధానాన్ని పెంపొందించుతుందని, ఈ మార్గంలో చుట్టుపక్కల ప్రాంతాలలో ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుందని ఆయన తెలిపారు. ఈ నూతన రైలు మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, సికింద్రాబాద్ నుండి ప్రత్యక్ష అనుసంధానాన్ని అందిస్తూ ఈ మార్గంలోని ఒక ముఖ్యమైన శివాలయం అయిన పర్లి వైజ్‌నాథ్‌ను కూడా కలుపుతుందని తెలిపారు. 2014 నుండి ఆంధ్రప్రదేశ్ 100శాతం విద్యుదీకరణతో 1,580 కి.మీ నూతన ట్రాక్‌ను జోడించిందని, రాష్ట్రంలో ఇప్పుడు 73 అమృత్ స్టేషన్లు 3,125 కోట్ల రూపాయల వ్యయంతో ఉధునీకరణలో ఉన్నాయని తెలిపారు. భారత రైల్వేలు తిరుపతిలో రూ. 312 కోట్ల విలువైన తిరుపతి అమృత్ స్టేషన్‌తో సహా ఇతర ప్రాజెక్టు పనులను చేపట్టాయని పేర్కొన్నారు. తిరుపతి- పాకల-కాట్పాడి డబ్లింగ్, గూడూరు - రేణిగుంట 3 వ లైన్, నడికుడి - శ్రీకాళహస్తి కొత్త లైన్, విజయవాడ , -గూడూరు 3 వ లైన్, యేర్పేడు -పూడి బైపాస్ లైన్ వంటి ప్రధాన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయన్నారు.

Tags

Next Story