నేను చచ్చిపోతేనే నిధులు ఇస్తారా..?

నేను చచ్చిపోతేనే నిధులు ఇస్తారా..?
X

జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు, నిధుల విడుదలలో జాప్యంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే 30 వేల మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. తన నియోజకవర్గానికి నిధులు విడుదల చేయకపోతే తాను చనిపోవడానికైనా సిద్ధమంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండల పరిధిలోని రంగారెడ్డిగూడ, గుండ్లపొట్లపల్లి తదితర గ్రామాల్లో ఆయన పర్యటింటారు. స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్చర్లలో పూర్తయిన, కొనసాగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంత్రుల నియోజకవర్గాల్లోనే బిల్లులు చెల్లిస్తారా?.. ఇతర నియోజకవర్గాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

ఇటీవల నాగర్‌కర్నూల్‌లో ఓ కాంట్రాక్టర్ మరణించిన అనంతరం ఆయనకు సంబంధించిన రూ.5 కోట్ల బిల్లు మంజూరైన విషయాన్ని ప్రస్తావించారు. తన నియోజకవర్గానికి సంబంధించిన సుమారు రూ.40 కోట్ల పెండింగ్ బిల్లుల విషయంలో ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయడంతోపాటు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. జడ్చర్ల నియోజకవర్గానికి సాగునీరు అందించే విషయంలోనూ పార్టీలకు అతీతంగా పోరాడతామని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని స్పష్టం చేశారు. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే ప్రభుత్వంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం, నిధుల విడుదల కోసం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

Tags

Next Story