ఆగస్టులో ఎగుమతుల జోరు

26.1 శాతం వృద్ధి.. 43.81 బిలియన్ డాలర్లకు ఎగుమతులు
ఐదు నెలల కనిష్ఠానికి వాణిజ్య లోటు.. 26.86 బిలియన్ డాలర్లు
ఇంజనీరింగ్, పెట్రోలియం, టెక్స్‌టైల్స్ ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్
మన తెలంగాణ / న్యూఢిల్లీ: భారత వస్తు ఎగుమతులు దూసుకెళ్లాయి. ఆగస్టులో ఎగుమతులు ఏకంగా 26.1 శాతం పెరిగి 43.81 బిలియన్ డాలర్లకు చేరాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిక్స్ దేశాలు, ఇతర వర్ధమాన మార్కెట్లలో పెరిగిన డిమాండ్ ఇందుకు దోహదపడింది. ఎగుమతులు పెరగడంతో పాటు దిగుమతులు తగ్గడంతో వాణిజ్య లోటు కూడా కుదిరింది. ఆగస్టులో ఇది 26.86 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఐదు నెలల్లో ఇదే కనిష్ఠం. జూలైలో వాణిజ్య లోటు 31.98 బిలియన్ డాలర్లు కాగా.. గత ఏడాది ఆగస్టులో 27.22 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
ఇంజనీరింగ్ వస్తువుల హవా
ఎగుమతుల వృద్ధిలో ఇంజనీరింగ్ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, టెక్స్‌టైల్స్ కీలక పాత్ర పోషించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో భారత ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో ఎగుమతులు బలమైన వృద్ధిని నమోదు చేశాయి. మరోవైపు బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. జూలైలో 4.16 బిలియన్ డాలర్లుగా ఉన్న పసిడి దిగుమతులు ఆగస్టులో దాదాపు సగానికి తగ్గి 2.3 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో మొత్తం దిగుమతులు కూడా జూలైలోని 76.22 బిలియన్ డాలర్ల నుంచి ఆగస్టులో 70.67 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
అమెరికాదే అగ్రస్థానం
భారత ఎగుమతులకు అతిపెద్ద మార్కెట్‌గా అమెరికా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఆగస్టు మధ్య అమెరికాకు భారత్ నుంచి 42.79 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అయ్యాయి. దేశీయ ఆర్థిక వృద్ధి, ఇంధన అవసరాల నేపథ్యంలో దిగుమతులు కొనసాగుతున్నప్పటికీ.. ఎగుమతులు మాత్రం బలమైన వేగాన్ని కొనసాగిస్తున్నాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. సంప్రదాయ మార్కెట్లను బలోపేతం చేసుకుంటూనే కొత్త మార్కెట్ల అవకాశాలను భారత్ అందిపుచ్చుకుంటోందని ఎఫ్‌ఐఈఓ అధ్యక్షుడు ఎస్.సి. రాలహన్ పేర్కొన్నారు.
ఎఫ్‌టీఏలపై వేగం
వాణిజ్య విస్తరణలో భాగంగా పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై కేంద్రం దృష్టి పెట్టింది. న్యూజిలాండ్‌తో కుదిరిన ఎఫ్‌టీఏ అక్టోబర్ చివరి నాటికి అమల్లోకి రానుంది. ఈయూ, కెనడాలతో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరులో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అమెరికాలో పర్యటించనున్నారు. జీ20 వాణిజ్య సమావేశంలో పాల్గొనడంతో పాటు అమెరికా ప్రతినిధులతో ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపై చర్చించనున్నారు.
Tags
-
Home
-
Menu
