400 ఎకరాల భూమి ఎలా సంపాదించారో చెప్పాలి

గత పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిందేమి లేదని.. అక్రమంగా 400 ఎకరాల భూమిని ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలని ఎంపి చామల కిరణ్ కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్ రెవెన్యూలో ఎంపిలు మల్లు రవి, అనిల్, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, నవీన్ యాదవ్,ఎంఎల్సి అద్దంకి దయాకర్, టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీశ్ తదితరులతో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలకు సంబంధించిన ఫాంహౌస్ భూములను సందర్శించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎంపి చామల కిరణ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా సంపాదించిన ఆస్తులను ప్రజలకు తెలియజేయాలనే తాము ఇక్కడికి వచ్చామని చెప్పారు.
అజీజ్నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 76లోని భూమి ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని.. అక్కడ ఏ విధంగా పెద్ద పెద్ద ఫాంహౌస్లను నిర్మించారని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో చెప్పులు లేకుండా నడిచామన్న వారికి.. ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. పేదలకు అందాల్సిన భూములను అధికార బలంతో ఆక్రమించుకున్నారని.. 2004 ఎన్నికల అఫిడవిట్లో లేని ఆస్తులు ఇప్పుడెలా వచ్చాయన్నారు. సర్వే నంబర్ 76లో హరీశ్ రావు ఇన్ని ఆస్తులు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి..ఎలా సంపాదించారు..అసైన్డ్ భూములను ఏ విధంగా కొంటారు.. అక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలను ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
డ్రగ్స్కు అడ్డగా మారుస్తున్నారు..
డ్రగ్స్కు అడ్డాగా తెలంగాణను మారుస్తున్నారని, బిఆర్ఎస్ నాయకులకు ఒక్కొక్కరికి రెండు లేదా మూడు ఫాంహౌస్లు ఉన్నాయని, అందులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అసీజ్ నగర్ రెవెన్యూలోని సర్వే నంబర్ 177లో గతంలో పేదల కోసం కేటాయించిన అసైన్డ్ భూమిని కొనుగోలు చేసి పెద్ద ఫాంహౌస్లు నిర్మించి..డ్రగ్స్కు అడ్డాగా మార్చారని ఆయన ఆరోపించారు. ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీలు, మాదకద్రవ్యాల సరఫరా జరుగుతోందనే అనుమానం వ్యక్తం చేశారు. గతంలో రోహిత్ రెడ్డి ఫాంహౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రూ.100 కోట్లు దొరికిన సంఘటన కూడా ఉందన్నారు. ఈ ఫాంహౌస్ గతంలో జరిగిన డ్రగ్స్ పార్టీలో కాల్పులకు కూడా తెగబడ్డారని,
బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుల ఫాంహౌస్లలో రేవ్ పార్టీలు కూడా జరుగుతున్న ఆరోపణలు ఉన్నాయన్నారు. బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో ఫాంహౌస్ కల్చర్ తీసుకువచ్చి ప్రజలను ఏం చేద్దామనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. రోహిత్ రెడ్డి జీవో 111కు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు ఉపేక్షించలేదని, అసైన్డ్ భూమిని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అసైన్ భూ చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు. పేదల నుంచి అసైన్డ్ భూములను గుంజుకొని పెద్ద పెద్ద ఫాంహౌస్లు నిర్మించారని, వాటిని సర్కార్ స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని కోరారు.
-
Home
-
Menu
