ఫోన్ ట్యా పింగ్ వెనుక రేవంత్, కెసిఆర్ ’చీకటి ఒప్పందం’: ఎంపి ధర్మపురి

ఫోన్ ట్యా పింగ్ వెనుక రేవంత్, కెసిఆర్ ’చీకటి ఒప్పందం’: ఎంపి ధర్మపురి
X

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యా పింగ్ వ్యవహారం వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య ’చీకటి ఒప్పందం’ కుదిరిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం జిల్లా బిజెపి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ’కమిషన్ల బంధం’ నడుస్తోందని ధ్వజమెత్తారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి పక్కదారి పట్టించి భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. నేషనల్ హెల్త్ స్కీమ్ కింద కేంద్రం విడుదల చేసిన కోట్ల రూపాయలను కేసీఆర్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తన హయాంలో జిల్లా అభివృద్ధి నిధులతో పాటు

మిషన్ భగీరథ నిధులను ఇష్టారాజ్యంగా మళ్లించారని దుయ్యబట్టారు. గత పదేళ్లలో టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) సాగించిన దోపిడీ అపారం. ఆ నిధుల అక్రమాలను సరిచేయడానికే ఇప్పుడు ఎంతో సమయం పడుతోంది‘ అని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ పని ఇప్పటికే అయిపోయిందని, ఆ పార్టీలో ప్రశాంత్‌రెడ్డి వంటి ’చీడపురుగులు’ మాత్రమే మిగిలారని, వారినీ త్వరలోనే బీజేపీ ఖతం చేస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన నితిన్ నబీన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆయన ఒక చిన్న కార్యకర్తనుంచి జాతీయ అధ్యక్షుడు వరకూ ఎదిగారన్నారు. ఆయన అధ్యక్షతన 19వ లోక్‌సభలోనూ అధికారంలోకి వస్తామని జోస్యం చెప్పారు. ఆయన ఓటమి ఎరగని ఘనత ఉందని తెలిపారు.


పులాంగ్ కబ్జాలపై కాంగ్రెస్ ద్వంద్వ నీతి

నిజామాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న పులాంగ్ వాగు కబ్జాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖ అధికారులు నోటీసులిచ్చినా, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ నేతలు కబ్జాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జిల్లాలోని ముస్లిం ప్రాంతాలు గత ప్రభుత్వంలోగానీ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోగానీ ఏమాత్రం ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు. ముస్లింలు మతపరంగాకాకుండా అభివృద్ధిని కాంక్షించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎంఐఎం నేతలు ఐదేళ్లకోసారి చుట్టపుచూపుగా వచ్చి వెళ్తారని ఎద్దేవా చేశారు.

నిజామాబాద్ పేరును ’ఇందురు’గా మార్చడంపై ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. ‘రజాకార్లతో చేతులు కలిపి మహిళలను హింసించి, పసిపిల్లలను రెండు ముక్కలు చేసిన నిజాం పేరు మనకెందుకు? ఈసారి 100 శాతం నిజామాబాద్ పేరు మార్చి తీరుతాం. దీనిపై కనీసం ఒక్కసారి కూడా గెలవని మహేష్ కుమార్ లాంటి వారు మాట్లాడటం హాస్యాస్పదం‘ అని ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో నష్టపోయిన ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంత రైతులకు ప్రభుత్వం కేవలం జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుందని, తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

అధికారుల తీరుపై ఆగ్రహం:

కేంద్ర ప్రభుత్వంనుంచి రూ.355 కోట్ల నిధులతో అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ పనులు చేపడితే, కంటికి కనిపించే పురోగతి ఎక్కడని ఎంపీ ప్రశ్నించారు. ‘మొత్తం 42 వేల కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంటే, కనీసం 400 కూడా పూర్తి చేయలేదు. ప్రతి సమావేశంలో అదే పాత సమాధానాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. స్టాఫ్ లేరు, వర్కర్లు లేరనే కుంటి సాకులు చెబుతారా?‘ అని అధికారులను నిలదీశారు. దీనిపై కొత్త కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, నెల రోజుల్లో మళ్ళీ సమీక్ష నిర్వహిస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Tags

Next Story