ఎవరిని మోసగించేందుకు ఎన్నికల షెడ్యూలు విడుదల:ఎంపి ఈటల

ఎవరిని మోసం చేయడం కోసం ఎన్నికల షెడ్యూలు విడుదల చేశారని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యరు. హనుమకొండ జిల్లా, కమలాపూర్ మండల కేంద్రంలోని తన నివాసంలో బిజెపి నాయకులతో మంగళవారం ఆయన సమావేశం అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల రిజర్వేషన్ పక్రియలో భారీగా లోపాలు ఉన్నాయని ఆరోపించారు. కోర్టులో చెల్లదని తెలిసిన కూడా బిసిలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించి గందరగోళానికి గురిచేస్తున్నారని అన్నారు. బీహార్, మహరాష్ట్రలో రిజర్వేషన్లపై నమోదైన పలు కేసులను సుప్రీం కోర్టు కొట్టివేసిందని అన్నారు. ఎవరూ కోర్టుకు వెళ్లవద్దని ముగ్గురు మంత్రులు అంటున్నారని, వెళ్త్తే అభ్యంతరం ఏమిటని తాను ప్రశ్నిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టవదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెబుతోందని అన్నారు.
నల్గొండ జిల్లాలోని గిరిజన తండాలో బిసిలు లేకున్నా రిజర్వేషన్ ప్రకటించారని, ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం,మంగలి తండాలో అంతా ఎస్‌టిలు ఉండగా సర్పంచ్ మాత్రం బిసి మహిళకు రిజర్వేషన్ ఇచ్చారని అన్నారు. హనుమకొండ జిల్లా, కమలాపూర్ మండలం, గుండేడు గ్రామంలో ఒకటి, రెండు వైశ్య కుటుంబాలు ఉంటాయని, కానీ అక్కడ ఓసికి కేటాయించారని అన్నారు. తమ పార్టీ తరుపున శాసనసభలో, కౌన్సిల్‌లో పూర్తి మద్దతిచ్చామని పూర్తి స్థాయి అనుభవం లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి నెలకొందన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం వచ్చిన కూడా తప్పులు దొర్లడం భాద్యతారహిత్యానికి నిలయమని వ్యాఖ్యానించారు. అణగారిన వర్గాలకు, జాతులకు అన్యాయం జరిగితే తమ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు శ్రీరాం శ్యాం, కనుకుంట్ల అరవింద్, తుమ్మ శోభన్‌బాబు, మౌటం సంపత్, పిల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
