మైకులు బంద్

పురపోరులో ముగిసిన ప్రచారం
ప్రలోభాలకు తెరలేపిన అభ్యర్థులు
విస్తృతంగా ప్రచారం చేసిన అన్ని ప్రధాన పార్టీలు
రేపు పోలింగ్.. 13న కౌంటింగ్
ప్రశాంతంగాపోలింగ్ నిర్వహణకు ఇసి ఏర్పాట్లు
ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్
ఎన్నికలు జరిగే స్కూళ్లకు సెలవు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ నెల 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. దీంతో 48 గంటల ముందే అంటే సోమవారం సాయంత్రం 5 గంటలకు అన్ని రకాల ప్రచారాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం తుది సన్నాహాలు చేస్తోంది. ఈ ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా ఎస్‌ఇసి పకడ్బంధీగా ఏర్పాట్లు చేస్తోంది. పోలీస్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.
రిటర్నింగ్ అధికారులకు సహకరించాలని పార్టీలను కోరారు. పోలింగ్ సిబ్బంది, పోలీసు అధికారులతో ఎస్‌ఇసి రాణికుముదిని ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓట్ల లెక్కింపు ముగిసే వరకు పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,982 వార్డుల్లో ఓట్లు వేసేందుకు 8,203 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. బుధవారం(ఫిబ్రవరి 11) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులు, 137 స్ట్రాంగ్ రూమ్‌లు, 136 ఓట్ల లెక్కింపు కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది.
అలాగే 742 మంది జోనల్ అధికారులు, 279 ఫ్లయింగ్ స్క్వాడ్, 381 స్క్వాడ్ బృందాలు, 1,370 రిటర్నింగ్ అధికారులు, 1,547 ఎఆర్‌ఒలు, 9, 560 పోలింగ్ అధికారులు, 31,428 మంది సిబ్బందిని నియమించి శిక్షణ ఇచ్చారు. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పోరేషన్ల ఎన్నికల కోసం సుమారు 25 వేల మంది పోలీసు సిబ్బందిని సిద్ధం చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే మరుసటి రోజు (ఫిబ్రవరి 12) నిర్వహిస్తారు. ఈనెల 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 16వ తేదీన 116 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక, 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండనుంది.
ఇక ప్రలోభాల ఎర
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఆయా వార్డుల్లో అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. దీంతో పోలీసులు, ఎన్నికల యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల జరిగే పట్టణాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత నెల 27న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పోలీసులు రూ.2,02,95,278 విలువైన నగదు జప్తు చేశారు. నగలు, నగదు, మద్యం, మత్తుపదార్థాలు, ట్యాబ్‌లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనుండగా నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 12,993 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 6,701 నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపిలతో పాటు ఆమ్ ఆద్మీ, బిఎస్‌పి, ఎఐఎంఐఎం, టిడిపి, వైఎస్‌ఆర్‌సిపితోపాటు పలు ఇతర రిజిష్టర్ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా పార్టీల నుంచి పోటీ చేసిన రెబల్స్, స్వతంత్రుల్లో కొంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ ఎన్నికల్లో మెుత్తం 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.వారిలో పురుష ఓటర్లు 25,62,369 ఉండగా, మహిళలు 26,80,014 మంది, థర్డ్‌జెండర్లు 640 ఓటర్లు ఉన్నట్లు ఉన్నారు. కాగా, ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలకు ఈ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. పట్టణ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
-
Home
-
Menu
