15 ఏళ్ల బాలిక హత్య.. తల్లి అరెస్ట్‌తో వెలుగులోకి సంచలన విషయాలు!

మన తెలంగాణ – వరల్డ్ డెస్క్: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. మాటలు రాని, వినికిడి లోపం ఉన్న 15 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. ఈ కేసులో కన్నతల్లి, సోదరుడిపైనే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణ అనంతరం తల్లిని అరెస్ట్ చేయగా, సోదరుడు పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నవంబర్ 19న గ్రామంలోని పశువుల పాకలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ సైన్స్ బృందం ఆధారాలు సేకరించింది. హత్యకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న ఓ వస్త్రాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. బాలికపై సుమారు రెండు నెలల క్రితం అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై 2026 సెప్టెంబర్‌లో కాంటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత కుటుంబంలో విభేదాలు, అనుమానాలు పెరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాలికకు అండగా నిలవాల్సిన కుటుంబ సభ్యులే ఆమెను వేధించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
తల్లి అరెస్ట్.. సోదరుడి కోసం గాలింపు
గ్రామీణ ఎస్పీ రాజేశ్ సింగ్ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసుల విచారణలో తల్లి సోమారియా దేవి తన ప్రమేయాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. హత్యలో సోదరుడి పాత్ర కూడా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. తల్లిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న సోదరుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు రావాల్సి ఉంది. వాటి ఆధారంగా మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు, హత్య వెనుక కారణాలు మరింత స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు. బాలికపై గతంలో జరిగిన నేరానికి సంబంధించి నమోదైన కేసు, ఆ తర్వాత కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బాలికకు న్యాయం చేయాలని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Tags
-
Home
-
Menu
