నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది : హరీశ్‌రావు

తన తోటను చూడటానికి కాంగ్రెస్ నాయకులు మూడు జిల్లాల పోలీసులతో, డ్రోన్ కెమెరాల నిఘాలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో రావాల్సిన అవసరం ఏముందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రశ్నించారు. తనకు ఒక్కమాట చెబితే దగ్గరుండి కడుపునిండా భోజనం పెట్టి, తోటంతా తిప్పి చూపిస్తానని అన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని స్పష్టం చేశారు. శుక్రవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బైండ్ల, పంబాల, పోతురాజుల, కొలువుల సంఘాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ రావు మాట్లాడారు.‘కాంగ్రెస్ నాయకుల్లా నేను ఎక్కడా భూములు కబ్జా చేయలేదు. ప్రజల సొమ్ము దాచుకోలేదు. 2018, 2023 ఎన్నికల అఫిడవిట్లలో నా భూములు, ఆస్తుల వివరాలన్నీ పూర్తిగా పొందుపరిచాను. ఇందులో దాచింది ఏమీ లేదు. సిద్దిపేట నియోజకవర్గం రామంచ గ్రామంలో నాకు మొత్తం 13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీనిపైనే కాంగ్రెస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
సిద్దిపేటకు వచ్చే కాంగ్రెస్ నాయకులు భయపడాల్సిన అవసరం లేదని, ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కడుపునిండా అన్నం పెట్టి ప్రేమతో పలకరించడం తమ సంస్కృతి అని అన్నారు. తన పనితీరును చూసే ప్రజలు ఏడుసార్లు భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. అంతరించిపోతున్న కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, బైండ్ల, పంబాల, పోతురాజుల, కొలువుల జాతికి తాను అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చదువుతోనే పేదరికాన్ని జయించవచ్చని, కేసీఆర్ ప్రవేశపెట్టిన గురుకులాల్లో తమ పిల్లలను చదివించాలని సూచించారు. రానున్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, మీ జాతికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రపంచ దేశాలకు మన సంస్కృతిని బతుకమ్మ, బోనాల పండుగల రూపంలో చాటి చెబుతున్నామని, సిద్దిపేట అంటేనే అభివృద్ధికి ఆదర్శమని, తాను ఏ పని చేసినా పది కాలాల పాటు నిలిచేలా, ప్రజలకు ఉపయోగపడేలా చేశానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు కడవెరుగు రాజనర్సు, మారెడ్డి రవీందర్ రెడ్డి, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, గుండు భూపేష్, పాల సాయిరాం, నాయకం వెంకట్, బైండ్ల సాయిలు, పరశురాములు, ప్రవీణ్ కుమార్, చిరంజీవి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Tags
-
Home
-
Menu
