అది ఒక్కటి చాలు బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి: మైనంపల్లి

కుత్బుల్లాపూర్: రేషన్ కార్డు ఒక్కటి చాలు బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికని, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడగానే రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ చెపట్టామని కాంగ్రెస్ నేత, మాజీ ఎంఎల్ఎ మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. దూలపల్లి లోని మైనంపల్లి హన్మంతరావు ఇంటి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీకి కొన్ని విషయాలు చెప్పదలచుకున్నానని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు ఏళ్ళు కావస్తోందని, తాము ఇచ్చిన హామీలు మరో ఐదేళ్ళ కాలంలో కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. మరో మూడేళ్ళలో మిగిలిన హామీలు నెరవేర్చుతామని, ఈ రోజు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని, అందుకు స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం అయిన నాయకులే నిదర్శనమని మైనంపల్లి ప్రశంసించారు.
కాళేశ్వరం నుండి కార్ల స్కాముల వరకు దోపిడీ చేశారని, డబుల్ బెడ్ రూమ్లు, ఉద్యోగాలు, దళితులకే పట్టం కడతామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేర్చకపోవడంతో బిఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పరన్నారు. పదేళ్లలో 1500 కోట్ల పార్టీ ఫండ్ ను సంపాదించుకుని, వందల వేల ఎకరాల భూములు కొల్లగొట్టారని దుయ్యబట్టారు. స్కీముల పేరుతో స్కాములు చేసి బిఆర్ఎస్ నాయకులు వేల కోట్లు దోచుకున్నారని మైనంపల్లి ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా చూసి బిఆర్ఎస్ నాయకులకు గుండెపోటు వస్తుందని చురకలంటించారు. మా పని మమ్మల్ని చేసుకోనివ్వండని, అభివృద్ధిని అడ్డుకోవాలని, సోషల్ మీడియా ద్వారా ఎన్నో అపోహలు సృష్టించి ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తున్నారని మండిపడ్డారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన కొన్ని మీడియా సంస్థలు లేని అపోహలు సృష్టిస్తున్నాయని, రాజకీయ పార్టీలకు సంబంధిచి ఏకపక్షంగా ఉండే మీడియా సంస్థలను బ్యాన్ చేయాలని కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
-
Home
-
Menu
