రవి గ్రహం గురించి సూక్ష్మంగా..

రవి గ్రహం గురించి సూక్ష్మంగా..
X

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టు తిరుగుతుంది. అందువలననే రాత్రి పగలు ఏర్పడుతాయని మనందరికి తెలిసిన విషయమే. చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టు తిరుగుట వలన వెన్నెల రాత్రులు, చీకటి రాత్రులు ఏర్పడుతున్నవి. ప్రతి వ్యక్తి తన జీవితంలో అనుభవించే సుఖ దుఖాలకు, లాభనష్టాలకు, వినోదాలకు, విచారాలకు ఎన్నో కారణాలు ఉండవచ్చు కానీ అన్నిటి కంటే ముఖ్యమైన కారణం నవగ్రహాల ప్రభావం, అంతరిక్షంలో సూర్య మండలంలో సంచరించే గ్రహాల స్థితిగతులను అనుసరించి మన జీవన విధానం జరుగుతుందని మన మహర్షులు మనకు జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలియజేశారు.

మానవ జీవితంపై రవిగ్రహ ప్రభావం, ప్రాముఖ్యత తిరుగు లేనిది. అన్ని గ్రహాలు కూడా రవిగ్రహం చుట్టే తిరుగుతాయి. ఈ రవి గ్రహం నవగ్రహాలకు అధిపతి. ఈ రవిగ్రహం అనుకూలంగా ఉంటే స్థిరమైన అధికారం, మంచి ఆరోగ్యము, పుత్ర సంతాన ప్రాప్తి కలుగు తుంది. సింహరాశికి అధిపతి రవి. మేషరాశి రవికి ఉచ్ఛస్థానం, తులారాశి నీచస్థానం. రవికి చంద్ర, కుజ, గురువులు మిత్రులు, బుధుడు సముడు. శుక్ర, శనులు శత్రు గ్రహాలు. రవికి శత్రుక్షేత్రాలు మకరం, కుంభం. మిత్రక్షేత్రం మీనం. సింహరాశిలో జన్మించిన వారు రవిగ్రహ ఆధిపత్యంలోకి వస్తారు. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాలలో పుట్టిన వారు, ఆదివారం రోజున పుట్టిన వారిపై రవి గ్రహ ప్రభావం ఉంటుంది. రవి పితృకారకుడు. రవి, సింహ రాశి మన శరీరంలో గుండెను తెలుపుతుంది. మగవారికి కుడి కన్ను, ఆడవారికి ఎడమ కన్ను రవి గ్రహ ప్రభావంలోకి వస్తాయి. రవి మేష రాశి ప్రవేశం నుండి సూర్యమాన సంవత్సరం ప్రారంభమవుతుంది. మనం చాంద్రమానం అనుసరిస్తాము. ఆదిత్యుడు, భానుడు, భాస్కరుడు, దినకరుడు, సూర్యుడు ఇవన్నీ కూడా రవిగ్రహం యొక్క పేర్లే. సూర్య చంద్రుల మధ్య దూరం అనుసరించి తిథులు, యోగం, కరణం లెక్కవేస్తారు. రవి గ్రహ జాతకులకు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఏదైనా అనారోగ్యం వచ్చినా త్వరగా కోలుకుంటారు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

ప్రభుత్వ ఉద్యోగాలకు, స్థిరమైన ఉద్యోగాలకు రవి కారకుడు. ఒక వ్యక్తి వైద్యవృత్తిలో రాణించాలంటే రవి గ్రహ అనుగ్రహం తప్పని సరి. రవిగ్రహంతో కలిసి ఉన్న ఇతర గ్రహాలను అనుసరించి వైద్య వృత్తిలో ఏ విభాగంలో రాణిస్తారో తెలుసుకోవచ్చు. రవిగ్రహ ఆధిపత్యంలో ఉన్న సింహరాశి స్థిరరాశి, పురుష రాశి, అగ్నితత్వ రాశి. అందువలన ఈ రాశిలో జన్మించిన వారు దృఢసంకల్పం కలిగి ఉంటారు, ఏదైన ఒక పనికి పూనుకుంటే అది విజయవంతం అయ్యే వరకు సహనంతో, ఆత్మవిశ్వాసంతో, దృఢసంకల్పంతో పనిచేస్తారు. ఎక్కువగా మాట్లాడరు, మౌనం ఎక్కువగా పాటిస్తారు.

రవి అనుకూలంగా ఉన్నప్పటికీ బలం లేక మంచి జరగని సమయంలో అప్పుడు రవిగ్రహానికి సంబంధించిన పూజలు, హోమాది క్రతువులు చేయాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నా అవి బలహీనత వల్ల సత్ఫలితాలు అందుకోలేకపోతున్నప్పుడు కావలసినవి పూజలు, జపాలు, శాంతులు, పరిహారాలు. రవికి బలం లేనప్పుడు అనగా స్వక్షేత్రమైన సింహరాశిలో కానీ, ఉచ్ఛస్థానమైన మేషరాశిలో కానీ లేకపోవడం నీచస్థానమైన తులలో, శత్రురాశులలో (వృషభ, తులా, మకరం, కుంభ, రాశులలో) ఉండటం. రవికి నవధాన్యాలలో గోధుమలు ప్రీతికరమైనవి, కనుక నవగ్రహాలు ఉన్న గుడిలో ఆదివారం రోజున రవిగ్రహానికి అర్చన చేసి, గోధుమలు దానంగా ఇవ్వాలి. అలాగే రవిగ్రహ స్తోత్రం, ఆదిత్య హృదయం పఠించడం మేలు చేస్తుంది.


:: పంచాంగ కర్త ::

శ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ సిద్ధాంతి

వైధిక్‌ఆస్ట్రో.కామ్ (www.vydicastro.com)

ఫోన్ నెం: 90141 26121, 84669 32224/2225

Tags

Next Story